తెలంగాణాలోని పురపాలక, నగర పాలక సంస్థల్లో చెత్తకు ‘QR కోడ్’తో చెక్ చెప్పనున్నారు. త్వరలోనే హౌజ్ హోల్డ్ బిన్ ట్రాకింగ్ కోసం QR కోడ్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ప్రతి ఇంటికీ గ్రీన్, బ్లూ కలర్లలో గల చెత్త బుట్టలను అందించనున్నారు. ఇళ్ల యజమానులు ఆయా చెత్త బుట్టల ద్వారా మాత్రమే నగర పాలక సంస్థ వాహనాలకు చెత్తను ఇవ్వాల్సి ఉంటుంది.
ఇంటి యజమానులు, లేదా ఇళ్లల్లో అద్దెకు ఉండేవారు చెత్త బుట్టల ద్వారా చెత్తను మున్సిపల్ వాహనాలకు ఇవ్వగానే స్కాన్ చేస్తారు. ఒకటి, రెండు రోజులు ఏదేని ఇంటికి సంబంధించి QR కోడ్ స్కాన్ కాలేదంటే ఆ ఇంటివాళ్లు చెత్తను బయట పారబోసినట్లుగానే పరిగణిస్తారు. ఇది గుర్తించిన మరుక్షణం సంబంధిత ఇంటి యజమానికి ఫైన్ విధిస్తారు.
ఇప్పటి వరకు వీధుల్లోని చెత్త డబ్బాలకు మాత్రమే QR కోడ్ విధానం అమలులో ఉండేది. ఆ డబ్బా నుంచి చెత్తను ఎత్తగానే QR కోడ్ స్కానింగ్ ప్రతిరోజూ జరిగేది. ఇదే తరహాలో ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్త డబ్బాలతో పాటు, ఇండ్లకు ఉంచిన QR కోడ్ స్కాన్ చేస్తారు.