మానవీయ వ్యవస్థ స్థాపనకే పోరాటమనేది మార్క్సిజపు సిద్ధాంతం… మార్క్స్ నిర్వచించిన భాష్యం కూడా. అమానవీయతపై పోరాడి, మానవీయ వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా సమసమాజ స్థాపనలో భాగంగానే విప్లవవాదులు చెబుతుంటారు. కానీ మార్క్సిజపు ఆలోచనా విధానానికి వ్యతిరేక దిశలో అమానవీయ హత్యలు చోటు చేసుకుంటున్న దృశ్యాలు సాక్షాత్కరిస్తుంటే… విప్లవ సంస్థల పంథాపై సహజమైన ప్రశ్నలే రేకెత్తుతుంటాయి.
వర్గ శత్రువును చంపే సమయంలోనూ అమానవీయ పద్ధతి ఉండరాదన్నది మార్క్సిజపు మూల సూత్రం కూడా. మావోయిజమైనా, లెనినిజమైనా మార్క్స్ రూపొందించిన సిద్ధాంతాల ప్రాతిపతికనే ఉంటాయనేది కాదనలేని వాస్తవం. కానీ ఇటీవలి కాలంలో మావోయిస్టు నక్సలైట్లు అమానవీయ పద్ధతిలో హత్యలకు పాల్పడుతున్నారనే వాదన వినిపిస్తోంది. గత రాత్రి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం అలుబాకలో నక్సలైట్లు మడూరి భీమేశ్వర్ అనే టీఆర్ఎస్ నాయకున్ని కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలోనే కాదు ఆ పక్కనే గల ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న పలు హత్యోదంతాల్లోనూ మావోయిస్టులు ‘పదునైన’ ఆయుధాలను వినియోగిస్తూ హత్యలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పదునైన ఆయుధాలు అంటే సంప్రదాయక ఆయుధాలను హత్యలకు వినియోగిస్తున్నారన్నమాట. అవి కత్తులైనా కావచ్చు. గొడ్డళ్లయినా కావచ్చు. లేదంటే ఇతరత్రా మరేదైనా కావచ్చు. తుపాకీ బుల్లెట్ వినియోగించకుండా మావోయిస్టులు ఇటువంటి పదునైన ఆయుధాలను వర్గశత్రు నిర్మూలన భావనలో హత్యలకు వినియోగిస్తున్న తీరుపైనా చర్చ జరుగుతోంది.
సాధారణంగా సామూహిక దాడుల్లో మాత్రమే సంప్రదాయక ఆయుధాల వినియోగం ఉంటుంది. కత్తులు, కటార్లు, కొడవళ్లు, గొడ్డళ్లు చేబూని పరస్పరం దాడులు చేసుకుంటుంటారు. కానీ ఇన్ఫార్మర్ పేరుతో, ఇతరత్రా కారణాలతో నక్సలైట్లు పాల్పడే హత్యల్లో ఎక్కువగా తుపాకులను వినియోగిస్తుంటారు. అంటే ఓ బుల్లెట్ ద్వారా క్షణాల్లోనే వర్గశత్రు ప్రాణం తీసే చర్యలకు పాల్పడుతుంటారు. ఇదంతా గతం. వర్తమానంలో మాత్రం మావోయిస్టు పార్టీ నక్సల్స్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు పలు సంఘటనల్లో కనిపిస్తోంది.
పదునైనా ఆయుధాలతో గొంతులు కోసి చంపడం, ప్రత్యేకంగా తయారు చేసుకున్న కత్తులను నేరుగా గుండెల్లోకి దింపి చీల్చడం వంటి చేష్టల ద్వారా మావోయిస్టులు పలు హత్యలకు పాల్పడుతున్న తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనల్లోనే కాదు, తెలంగాణాలోని ములుగు జిల్లా వెంకటాపూర్ లో గత అర్ధరాత్రి దాటాక మావోయిస్టులు ఈ తరహాలోనే ‘అమానవీయ’ హత్యకు పాల్పడినట్లు ఘటనా స్థలంలోని పదునైన ఆయుధం వెల్లడిస్తోంది. ఆరుగురు నక్సలైట్లు భీమేశ్వర్ ఇంటి తలుపులను పగులగొట్టి, అతన్ని బయటకు లాక్కుని వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా తుపాకీ తీసి భీమేశ్వర్ ను కాల్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. పెనుగులాటలో తుపాకీ తూటాలు కిందపడిపోయాయంటున్నారు. ఈ క్రమంలో పరిసర ప్రజలు మేల్కొనడం, ఏదో వాహనం వస్తున్నట్లు లైట్లు కనిపించడంతో తమ వద్దగల పదునైన కత్తిని తీసి నక్సలైట్లు భీమేశ్వర్ గుండెను చీల్చి నక్సల్స్ వేగంగా వెళ్లిపోయినట్లు సమాాచారం. కొన ఊపిరితో గల భీమేశ్వర్ ను చికిత్స కోసం తరలిస్తుండగానే ఆయన ప్రాణం కోల్పోయినట్లు ప్రత్యక్షసాక్షుల కథనం.
వర్గశత్రు నిర్మూలనలో భావోద్వేగాలకు, తీవ్ర ఒత్తిళ్లకు లోనైన సందర్భాల్లో అనూహ్యంగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవచ్చనే వాదన సరైందనే కాదనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఛత్తీస్ గఢ్ లో తరచూ పదునైన ఆయుధాలతోనే మావోలు పలు హత్యలకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పలువురు జవాన్లను కిడ్నాప్ చేసి పదునైన ఆయుధాలతో గొంతులు కోసి, వారి డెడ్ బాడీలను రోడ్డుమీద గిరాటేసినట్లు కూడా ఛత్తీస్ గఢ్ మీడియాలో ఇటీవల పలు వార్తా కథనాలు వచ్చాయి.
మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే.. మార్క్స్ చెప్పిన మౌళిక సూత్రం ప్రకారం వర్గశత్రు నిర్మూలన లక్ష్యంతో మావోయిస్టులు చేస్తున్న హత్యల్లో మానవీయతను చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అమానవీయ పద్థతిలో హత్యలకు పాల్పడుతున్నారనే అంశం తాజా ఘటనలోనూ వెల్లడైందంటున్నారు. అంతమాత్రాన మానవీయ పద్ధతిలో హత్యలు జరగాలని కోరుకోవడం కాదని, అమానవీయ పద్ధతిని ప్రస్తావించడం, ప్రశ్నించడం మాత్రమేనని విప్లవ కార్యకలాపాల పరిశీలకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఏ విలువలను ప్రతిష్టిస్తున్నాయనే ప్రశ్నలను కూడా ఆ వర్గాలు సంధిస్తున్నాయి. ప్రతి హత్యకు మూడు, నాలుగు దశల్లో చర్చ పార్టీపరంగా జరగాలనేది విప్లవ కార్యకలాపాల్లో అనుసరించే పద్ధతని, ఆ దిశగా ఈ అమానవీయ హత్యల ఘటనలకు సంబంధించి చర్చ జరుగుతున్నదా? లేదా? అనేది అసలు సందేహంగా ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అమానవీయ హత్యలను అంతఃసూత్రాలు అంగీకరించేనా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
ఇదిలా ఉండగా సరిగ్గా వారం రోజుల క్రితం పలువురు ఉన్నత పోలీసు అధికారులు సమావేశమైన ప్రాంతంలోనే మావోయిస్టులు టీఆర్ఎస్ నేత భీమేశ్వర్ ను హత్య చేయడం గమనార్హం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో సీనియర్ సెక్యూరిటీ అడ్వయిజర్ గా వ్యవహరిస్తున్న కె. విజయకుమార్, తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీ ఏపీ మహేశ్వరి, నక్సల్ ఏరివేత స్పెషల్ డీజీపీ అశోక్ జునేజా, ఛత్తీస్ గఢ్ సీఆర్పీఎఫ్ ఆపరేషన్స్ డీఐజీ ప్రకాష్, బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ తదితర ఐపీఎస్ అధికారులు ఈనెల 4వ తేదీన వెంకటాపురంలో సమావేశమైన సంగతి తెలిసిందే.
మావోయిస్టు పార్టీ నక్సలైట్ల ఏరివేతకు ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో వ్యవహరించాల్సిన పద్ధతులపై, అనుసరించాల్సిన వ్యూహాలపై దాదాపు నాలుగు గంటలపాటు ఇక్కడ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి చర్చించారు. వెంకటాపూర్ మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో గల అలుబాకలో అధికార పార్టీ నేత భీమేశ్వర్ ను నక్సల్స్ హత్య చేయడం తీవ్ర సంచలనానికి దారి తీసింది. తద్వారా పోలీసు ఉన్నతాధికారులు సమావేశమైన ప్రాంతంలోనే మావోయిస్టులు తమ ఉనికిని చాటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.