డబ్బు చాలా మందికి ఉంటుంది. లక్షలు కాదు… కోటాను కోట్లు కలిగి ఉంటారు. కానీ ‘పిల్లికి బిచ్చం పెట్టరు’ అనే సామెతకు తగిన విధంగా కొందరు పేరు తెచ్చుకుంటారు. పీనాసితనానికి ప్రతిరూపంగా కనిపిస్తుంటారు. ఉదాహరణకు మొన్నా మధ్య ఓ పట్టణంలో కొందరు రైస్ మిల్లర్లు బియ్యం బస్తాలను, కాంట్రాక్టర్లు వంట నూనె పాకెట్లను, ఇతరత్రా చిన్నా, చితకా, పెద్ద వ్యాపారులందరూ సంయుక్తంగా పప్పు, చింతపండు, ఉల్లిగడ్డలు వంటి వస్తు సామాగ్రిని సేకరించారు. కరోనా కల్లోలంలో జర్నలిస్టుల కుటుంబాల కోసం ఆయా వస్తువులను అన్నింటినీ ఓ చోట చేర్చారు. స్థానిక ఎమ్మెల్యే రానే వచ్చారు. కొంత మంది జర్నలిస్టులకు వాటిని పంపిణీ చేశారు. ఫొటోలకు ఫోజులిచ్చిన ఎమ్మెల్యేను ‘ఆహో.. ఓహో… ఏమి ఉదారవాదం? దొరుకునా ఇటువంటి ఎమ్మెల్యే!’ అంటూ భజనపరులు కీర్తించారు. కానీ ఇందులో ఎమ్మెల్యే చేసిన సాయం నయాపైసా కూడా లేదు. సరుకులు దానం చేసిన దాతృత్వవాదుల ఊరూ, పేరూ మాత్రం లేకుండా పోయింది. ఎమ్మెల్యేకు ఎదురు చెప్పని స్థితిలో వారూ మిన్నకున్నారన్నది వేరే విషయం. కానీ తామే సాయం చేయించామని కొందరు జర్నలిస్టులు జబ్బలు చరుచుకున్నారు. సరే… ఈ వివాదాస్పద సీన్ ఇక్కడితో కట్ చేస్తే…
అసలు విషయంలోకి వస్తే… గాయత్రి రవి అలియాస్ వద్దిరాజు రవిచంద్ర తెలుసు కదా? ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడైన రవి ఉదారవాదం, దాతృత్వం గురించి కొత్తగా పరిచయం అక్కర లేదు. ఇటువంటి విషయాల్లో ప్రచారాన్ని కూడా ఆయన పెద్దగా ఇష్టపడరు. కానీ తాజా విషయాలనే ప్రస్తావిస్తే కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం సీఎం సహాయ నిధికి రూ. 25 లక్షల మొత్తాన్ని రవి ఇటీవలే విరాళంగా అందించారు. గాయత్రీ రవి ప్రస్తుతం ఎమ్మెల్యే కాదు, ఎంపీ కూడా కాదు. కానీ మంచి పనులకు విరాళాలు అందించడంలో రవి చేతికి ఎముక ఉండదని ఆయన గురించి తెలిసినవారు చెబుతుంటారు. ఇప్పుడీ అంశాలన్నీ ఎందుకంటే…?
లాక్ డౌన్ పరిణామాల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు తనదైన ఉదారవాద శైలిలోనే రవి మంగళవారం సాయం చేయడం విశేషం. ఒక్కో జర్నలిస్టుకు రూ. 2 వేల విలువైన 25 కిలోల బియ్యం బస్తా, ఇతర నిత్యావసర వస్తువుల కిట్లను అందించారు. ఖమ్మం నగరంలోని 250 మంది జర్నలిస్టులకు అందించిన ఈ కిట్ల విలువ దాదాపు రూ. 5.00 లక్షలు. మంగళవారం ఎన్నెస్పీ క్యాంపు కార్యాలయంలో ఖమ్మం జర్నలిస్టులకు వీటిని అందించారు.
విశేషమేంటంటే జర్నలిస్టులకు తన సొంత డబ్బుతో మాత్రమే చేసిన ఈ సాయంలో గాయత్రి రవి ఎక్కడా ప్రచార కండూతికి పాల్పడకపోవడం. టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) ఆధ్వర్యంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి జర్నలిస్టుకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. గాయత్రి రవి చేసిన ఈ సరుకులు తమ కుటుంబానికి నెలరోజులపాటు సరిపోతాయంటూ జర్నలిస్టుల సంతోషానికి అవధుల్లేవు. అదీ గాయత్రి రవి దాతృత్వపు ప్రత్యేకత. డబ్బు అందరికీ ఉంటుంది… కానీ గాయత్రి రవి లాంటి దాతృత్వవాదులు అరుదుగా కనిపిస్తుంటారు. అందుకే ఈ వార్తా కథనం.