కరోనా వైరస్ కట్డడికి ప్రముఖ పారిశ్రామికవేత్త, గాయత్రి గ్రానైట్స్ అధినేత, టీఆర్ఎస్ రాష్ట్ర నేత వద్దిరాజు రవిచంద్ర భారీ విరాళం ప్రకటించారు. కరోనా మహమ్మారిని కట్టడికి దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు గాయత్రి రవి స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రగతి భవన్ లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు రూ. 25 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా గాయత్రి రవిని మంత్రులిద్దరూ అభినందించడం విశేషం.
తన అభిమానులు, యువకులు గాయత్రి గ్రానైట్స్ సంస్థ సహకారంతో ఇప్పటికే ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారని రవి మంత్రులకు నివేదించారు. ముఖ్యంగా లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉపాధి లేని నిరుపేదలకు, వలస కార్మికులకు నిత్యావసర సరుకులు, భోజన సదుపాయం, మాస్క్ ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆదుకుంటున్న అంశాన్ని గాయత్రి రవి కేటీఆర్, ఈటెలకు వివరించారు. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు తమ సేవలు నిరంతరాయంగా కొనసాగిస్తామని రవి హామీ ఇచ్చారు. గాయత్రి రవి సేవా నిరతిని మంత్రులు కేటీఆర్, ఈటెల ఈ సందర్భంగా కొనియాడారు. కరోనా మహమ్మారిని పారదోలే వరకు ప్రజలను ఆదుకోవడంతో పాటు, వారు సురక్షితంగా ఉండేలా అవగాహన కల్పించాలని మంత్రులు రవికి సూచించారు. మంత్రులను కలిసిన రవి వెంట వద్దిరాజు నాగరాజు కూడా ఉన్నారు.