మండుటెండలో చిత్తు కాగితాలు ఏరుకుంటున్న ఓ మహిళ దీనావస్థను చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నేత వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి తీవ్రంగా చలించారు. ఇందుకు సంబంధించిన ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

గాయత్రి రవి సోమవారం మధ్యాహ్నం ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా, ఖమ్మం నగర బైపాస్ రోడ్డు మార్గంలో మండుటెండలో కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా గొలుసుల పద్మ ఆమె భర్త ఎల్లయ్య , కుమారులు శ్రీను(15), మహేష్(13), రాజేష్(12), రాజు(10) చిత్తు కాగితాలు ఏరుకుంటున్న దృశ్యాన్ని చూశారు. కరోనా పరిస్థితుల్లోనూ ఎర్రని ఎండలో పద్మ కుటుంబీకుల దీనావస్థను చూసిన రవి తీవ్రంగా చలించారు. వెంటనే తన కారును పక్కకు ఆపి
ఆ మహిళ వద్దకు వెళ్లారు.

‘ఏంటమ్మా… మండుటెండలో కాళ్లకు కనీసం చెప్పులు లేకుండా ఈ అవస్థలు ఏంటి?’ అని గాయత్రి రవి ఆమె స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తన భర్త, పిల్లలతో కలిసి మొత్తం అరుగురం కుటుంబ సభ్యులం సమిష్టిగా కష్టపడాల్సిదేనని ఆమె చెప్పారు. ప్రతీ రోజు తమ ఇంట్లో మూడు కిలోల బియ్యం ఉడకాలని, అవి కావాలంటే ఈ చిత్తుకాగితాలే తమకు జీవనోపాధి అని, ఎండైనా, వానైనా ఇది తప్పనిసరి కష్టంగా ఆమె వివరించింది. పొట్ట కూటికోసం ఈ విధంగా చిత్తు కాగితాలను అమ్ముకొని జీవనం సాగిస్తున్నామని పద్మ పేర్కొంది.

హృదయాన్ని కలచివేసిన ఆమె మాటలు విన్న గాయత్రి రవి వెంటనే తన కారులో ఉన్న నిత్యావసర సరుకులను, మాస్కులను, కొంత ఆర్ధిక మొత్తాన్ని సహాయంగా పద్మ కుటుంబానికి అందించారు. కరోనా మహమ్మారి నియంత్రణకు మాస్క్ లు విధిగా ధరించాలని రవి వారికి సూచించారు. తమ పట్ల మానవత్వాన్ని చాటిన గాయత్రి రవికి పద్మ కుటుంబ సభ్యులు చేతులెత్తి దండం పెట్టారు.

Comments are closed.

Exit mobile version