‘హతవిధీ’ అన్నట్లుగా ఉంది కదూ… ఈ దృశ్యం? కరీంనగర్ జిల్లాకు చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హావభావం ఇది. ఇండోనేషియాకు చెందిన విదేశీయులు కరీంనగర్ లో యధేచ్ఛగా సంచరించి, కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణతో ఆసుపత్రికి తరలించిన పరిణామాల నేపథ్యంలో మంత్రి తన శిరాన్ని ఇలా పట్టుకున్నప్పటి దృశ్యమిది. కరీంనగర్ కలెక్టర్ శశాంక ఇండోనేషియాకు చెందిన విదేశీయుల సంచారం గురించి వివరించిన సందర్భంగా కరోనా ఉపద్రవాన్ని తలచుకుంటూ, ఏం చేయాలిరా భగవంతుడా? అనే భావాన్ని స్ఫురింపజేస్తున్నట్లు మంత్రి కమలాకర్ హావభావాలు కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలో కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు కూడా ఉన్నారు. ఇండోనేషియాకు చెందిన విదేశీయులకు కరోనా వైరస్ సోకిన పరిణామాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే… ఈ ఘటనను పూర్తిగా మర్చిపోకముందే నల్లగొండ జిల్లా కేంద్రంలో వియత్నాం దేశానికి చెందిన 14 మందిని పోలీసులు గురువారం అర్థరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ ఉదంతంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ఈ తాజా సంఘటన మరో కలకలానికి దారి తీసింది.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని జైల్ ఖానా సమీపంలో ఇద్దరు చిన్నారులు సహా 14 మంది విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వాస్తవానికి వీళ్లంతా ఈనెల 4వ తేదీనే ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగారట. అక్కడి నుంచి 9వ తేదీన నాంపల్లికి చేరుకుని, ఇద్దరు గైడ్లను వెంటేసుకుని నల్లగొండకు వచ్చారు. దాదాపు 14 రోజుల నుంచి వియత్నాం వాసులు నల్లగొండలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వీళ్లను అదుపులోకి తీసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నల్లగొండలో స్థానికంగా జరిపిన పరీక్షల్లో వీరికి ఎటువంటి కరోనా లక్షణాలు ఉన్నట్లు వెల్లడి కాలేదు. కానీ ముందు జాగ్రత్తలో భాగంగా వీరిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విదేశీయులు అంశంలో తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో భాగంగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. బ్యాచ్ ల వారీగా వివిధ జిల్లాల్లో దిగి, సంచరిస్తున్న విదేశీయుల అంశంలో పోలీసు శాఖకు చెందిన నిఘా విభాగాలు మరింత అప్రమత్తమయ్యాయి.
కరీంనగర్ లో ఇండోనేషియాకు చెందిన విదేశీయులను అదుపులోకి తీసుకున్న సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి మరికొన్ని చిత్రాలను, నగరంలో వారు సంచరించిన వీడియోను కూడా ఇక్కడ చూడవచ్చు.