ఔను…ఈసారి మీరు తిరుమలకు వెడితే జపాలి వద్ద గల బెట్లుడుతను మీరు చూడడమే కాదు, మీ బుడతలకు కూడా తప్పక చూపాల్సిందే. ఉడుతల ప్రత్యేకత ఏమిటి? మన ఊళ్లల్లో చాలా ఉడుతలు కనిపిస్తాయి కదా? అనుకోకండి.
మన గ్రామాల్లో కనిపించే ఉడుతలు వేరు. జపాలి అడవుల్లో గల ఉడుతలు వేరు. మనకు నిత్యం కనిపించే ఉడుతలు రామ నామాల రేఖలతో ఉంటాయి. లంకకు వెళ్లడానికి వారధి నిర్మిస్తున్న సమయంలో తనవంతు సాయం చేసిన ఉడుత భక్తికి పరవశించిన శ్రీరాముడు దాన్నిదగ్గరకు తీసుకుని వీపుపై నిమిరాడట. అందుకే మనకు కనిపించే ఉడుతల వీపుపై తెల్లని చారికలు కనిపిస్తాయి.
కానీ తిరుమల కొండల్లోని జపాలి అడవుల్లో కనిపించే బెట్లుడతకు ఎటువంటి రేఖలు కనిపించవు. బంగారు రంగు వర్ణంలోనేగాక నలుపు, పసుపు రంగుల రూపంలో కనిపించే ఈ ఉడుతలు జపాలి ఆంజనేయస్వామి గుడికి వెళ్లే మార్గంలో మనకు కనువిందు చేస్తాయి. వచ్చీపోయే భక్తులు ఇచ్చే కొబ్బరి ముక్కల కోసం ఎటువంటి సంకోచం లేకుండా దగ్గరకు వస్తుంటాయి.
సాధారణ ఉడుత బరువు 250-340 గ్రాములు మాత్రమే. కానీ ఇండియన్ జైంట్ స్కైరల్ గా వ్యవహరించే ఈ బెట్లుడుత శరీర బరువు 2.5 కిలోలు. బంగ్లాదేశ్, శ్రీ లంకల్లో నివాసముండే ఈ ఉడుత మన దేశంలో తిరుమల కొండల్లో మాత్రమే కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఈసారి తిరుమల వెళ్లినపుడు జపాలి ఆంజనేయస్వామి దర్శనానికి వెడితే ఈ ఉడుతల కోసం మీరు వెతకాల్సిన అవసరం కూడా లేదు. మార్గమధ్యంలో యాధృచ్ఛికంగానే మీకు తారసపడతాయి.