ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు ముగిశాయి. స్థానిక ఇందుపల్లి ఎ-1 కన్వెన్షన్లో నిర్వహించిన ఈ పోటీలకు దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది బాడీ బిల్డర్లు హాజరు కావడం విశేషం. అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసభరిత వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో 15 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో బాడీ బిల్డర్లు తమ శరీర ధారుడ్యాన్ని ప్రదర్శించారు.
జూనియర్ మిస్టర్ ఇండియా టైటిల్ ను మహారాష్ట్రకు చెందిన ప్రీతమ్ గమరే కైవసం చేసుకున్నట్లు ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ (IBBF) కోశాధికారి, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా మహిళా బాడీ బిల్డింగ్ (మోడల్ ఫిజిక్) పోటీలను కూడా అమలాపురంలో నిర్వహించామన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి బాడీ బిల్డర్ ను తమ ఫెడరేషన్ అభినందిస్తున్నదని, మున్ముందు మరిన్ని ప్రతిష్టాత్మక పోటీలను కూడా నిర్వహిస్తామని స్వామి రమేష్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు.