ఖమ్మం నగరంలో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఓ ఘటన ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో 10 మంది బీజేపీ కార్యకర్తలను ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఖమ్మం నగరంలోని మత్యాలమ్మ గుడి సెంటర్, చర్చి కాంపౌండ్ ఏరియాలోని జంక్షన్ లో ఓ కట్టడాన్ని నిర్మిస్తుండగా బీజేపీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

ఈ సంఘటనకు సంబంధించి మాజీ కౌన్సిలర్ కాళంగి దేవదానం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సామినేని సాయి గణేష్, బోయిన సందీప్ కుమార్, గోనాల రాజ్ కుమార్, లింగనబోయిన నవీన్, నర్రా శ్రీకాంత్, దాసరి సాయి, కర్నె దిలీప్, నాగిరెడ్డి ప్రోచితారెడ్డి, జాదవ్ విక్రమ్, బానోత్ రంజిత్ కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయా నిందితులపై ఐపీసీ 143, 332, 153 (ఎ), 295 (ఎ) రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

కాగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఖమ్మం సిటీ ఏసీపీ అంజనేయులు స్పష్టం చేశారు.

గత రాత్రి చర్చి కంపౌండ్ సెంటర్లో జరిగిన సంఘటను వక్రీకరిస్తూ మతపరమైన దుష్ప్రచారానికి తెరలేపుతూ సామాజిక విద్వేషాలు పెంచే రీతిలో పోస్ట్ పెడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.

తమ ఉనికి కోసం ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా, కించపరిచేలా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు, ఫొటోలు పెడితే చాలు.. ముందూ వెనుక ఆలోచన చేయకుండా వేరేవాళ్లకి షేర్ చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలు తీవ్రంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అంతేకాకుండా దుష్ప్రచారాన్ని ప్రోత్సహించే వారిపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో పోస్టులను, వీడియోలను, ఇతరుల వ్యాఖ్యలను షేర్ చేసే ముందు పరిశీలన చేయాలని, అది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలని, ఘర్షణలు రేకెత్తించే పోస్టులకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

Comments are closed.

Exit mobile version