మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద తెలంగాణాలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యులు అంబులెన్సులను విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంబులెన్సుల ప్రారంభోత్సవం దశలవారీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే సోమవారం 19 అంబులెన్సులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద వీటిని బహూకరించారు. మొత్తం 19 అంబులెన్సులను మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో జెండా ఊపి ప్రారంభించారు.
అయితే ఈ అంబులెన్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వాటిని విరాళంగా ఇచ్చినవారిలో దాదాపు అందరూ హాజరయ్యారు… ఒకే ఒక్క మంత్రి మినహా. ఇదే ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో వేడి వేడి చర్చ. రెండు అంబులెన్సును ‘గిఫ్ట్ ఏ స్మైల్ కింద’ విరాళంగా అందించిన ఆ మంత్రి వాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ మంత్రికి అసలు ఆహ్వానమే అందలేదని, రానున్న రోజుల్లో ఏ జరగబోతోందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని సోషల్ మీడియా పోస్టు ఒకటి చక్కర్లు కొడుతోంది. దీంతో రాజకీయంగా ఆ మంత్రి భవితవ్యంపై మళ్లీ చర్చ జరుగుతోంది. ‘రాసలీలల’ వివాదంలో ఆ మంత్రి ఇటీవల చిక్కుకోవడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు.
వాస్తవానికి వివాదాన్ని ఎదుర్కుంటున్న మంత్రి సోమవారం హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. రాసలీలల వివాదాంశం అధికార పార్టీ అనుకూల పెద్దలకు చెందిన 10 టీవీలో ప్రముఖంగా ప్రసారమైన రోజునుంచి కూడా మంత్రి తన నియోజకవర్గంలో ఉన్న దాఖలాలు లేవు. అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉన్నట్లు స్పష్టమైన సమాచారం ఉంది. అయితే సోమవారం అంబులెన్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయా మంత్రి ఎక్కడా కనిపించకపోవడం అధికార పార్టీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివాదాన్ని ఎదుర్కుంటున్న ఆయా మంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో లేకపోయినా, ఆయన విరాళంగా ఇచ్చిన రెండు అంబులెన్సులు మాత్రం అక్కడ కనిపించడం, ప్రారంభోత్సవానికి నోచుకోవడం విశేషం.
ఫొటో: సోమవారం ప్రగతి భవన్ లో అంబులెన్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించిన దృశ్యం