మొన్న ఓ యువకుడి ఖాతాలో రూ. 5.5 లక్షలు… నిన్న ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో రూ. 960.00 కోట్లు… తాజాగా ఇంకో వృద్ధుని అకౌంట్ లో రూ. 52.00 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చి పడుతోందో తెలియదు. కానీ తమ ఖాతాల్లో ఇలా కట్టల్లా వచ్చి పడుతున్న రూ. లక్షలు, కోట్ల మొత్తాలను చూసి సంబంధిత ఖాతాదారులు మాత్రం నివ్వెరపోతున్నారు. అయితే ఈ భారీ మొత్తపు డబ్బును వాడుకునేందుకు బ్యాంకు అధికారులు అనుమతించకపోవడంతో సంబంధిత ఖాతాదారులు ఒకింత బాధ పడుతున్నారు కూడా.
కొద్ది రోజుల క్రితం బీహార్ లోని ఖగడియాకు చెందిన ఓ యువకుడి ఖాతాలో అకస్మాత్తుగా రూ. 5.5 లక్షల డబ్బు జమ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఆయా మొత్తాన్ని కానుకగా ఇచ్చారని, రూ. 15 లక్షల హామీలో భాగంగా తొలి విడతగా రూ. 5.5 లక్షలు జమ చేశారని, ఆ మొత్తాన్ని తాను తిరిగి ఇచ్చేది లేదని ఖాతాకు సంబంధించిన యువకుడు భీష్మించాడు. చివరికి చేసేదేమీ లేక అధికారులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండుకు పంపారనేది వేరే విషయం.
ఈ ఘటనను మరువక ముందే కటిహార్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థుల ఖతాల్లో ఏకంగా రూ. 960.00 కోట్ల భారీ మొత్తపు డబ్బు జమ అయింది. తాజా ఘటనలో ముజఫర్ నగర్ కు చెందిన రామ్ బహద్దూర్ షా అనే వృద్ధుని ఖాతాలో రూ. 52.00 కోట్లు జమయ్యాయి. తన ఫించన్ ఖాతా ఆధార్ పరిశీలన కోసం వెళ్లిన బహద్దూర్ షా తన ఖాతాలో రూ. 52 కోట్ల డబ్బు ఉన్నట్లు కనిపించడంతో షాక్ కు గురయ్యాడు.
ఈ మూడు వరుస ఘటనలు బీహార్ రాష్ట్రంలోనే జరగడం గమనార్హం. అయితే ఇంత భారీ మొత్తపు డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నదో తెలియక బ్యాంకు అధికారులు తలలు నిమురుకుంటున్నారట. డబ్బును వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నవారిని బ్యాంకర్లు నిలువరిస్తున్నారట. బీహార్ లో వరుసగా జరుగుతున్న ఈ తరహా ఉధంతాలు దేశవ్యాప్త చర్చనీయాంశంంగా మారాయి.
ఫొటో: ప్రతీకాత్మక చిత్రం