మీరు చూస్తున్న ఈ చిత్రంలో చెప్పులు తుడుస్తున్న వ్యక్తి పేరు కనకయ్య. సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో అటెండర్ గా పనిచేస్తున్నారు. అయితే ఏంటీ అనుకుంటున్నారా? కనకయ్య తుడుస్తున్న చెప్పులు తనవి కాకపోవడమే ఇక్కడ అసలు వార్త. కనకయ్య తుడుస్తున్నది సిరిసిల్ల డీఎంహెచ్ వో చంద్రశేఖర్ ‘దొర’ వారి చెప్పులట. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చంద్రశేఖర్ ‘దొర’ వారు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తనిఖీ కోసం వెళ్లారట. ఈ సందర్భంగా డీఎంహెచ్ వో చంద్రశేఖర్ దొరవారి చెప్పులను సదరు తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అటెండర్ కనకయ్య తుడుస్తుండగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఇందులో తన తప్పేమీ లేదని డీఎంహెచ్ వో చంద్రశేఖర్ ‘దొర’ వారు సెలవిస్తున్నారు. తన చెప్పులపై క్యాండిల్ మరకలు పడ్డాయని, తానే వాటిని తొలగిస్తుండగా, అటెండర్ కనకయ్య మధ్యలో కల్పించుకున్నట్లు ఆయన వివరణ ఇస్తున్నారు. తాను వారిస్తున్నావినకుండా తన చెప్పులను కనకయ్య తీసుకువెళ్లాడని, చెప్పులు తుడిపించుకునే స్థాయికి తాను దిగజారలేదని అంటున్నారు. కనకయ్య తన చెప్పులు తుడుస్తున్న ఫొటో ఎవరు తీశారో కూడా తనకు తెలియదని, ఇంట్లో పనులు కూడా తానే చేసుకుంటానని డీఎంహెచ్ వో చంద్రశేఖర్ ‘దొర’ వారు వివరించారు. వెనకటి రోజుల్లో దొరల గడీల ముందు నుంచి చెప్పులతో నడిచే అవకాశం ఉండేది కాదని, చెప్పులు విడిచి, వాటిని చేతబట్టుకుని వెళ్లిన ఉదంతాలు ఉన్నట్లు కథనాలు ఉండగా, తాజా ఉదంతం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అమానుష ఘటనపై ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. డీఎంహెచ్ వో పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కాబోయే ముఖ్యమంత్రిగా ప్రాచుర్యం పొందుతున్న సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఉదంతంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.