పోలీసులు ప్రభుత్వంలో భాగమే కదా? ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు కదా? పోలీసుల చర్యను నిందించినా, తప్పు పట్టినా అది ప్రభుత్వ పాలన తీరును కూడా వేలెత్తి చూపినట్లే కదా? చిల్లర ప్రమోషన్లకోసం, ట్రాన్స్ ఫర్ల కోసం పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని నిందిస్తే సర్కారు పద్ధతిని సైతం తూర్పార బట్టినట్లే కదా? ఏ విపక్ష పార్టీకి చెందిన నాయకుడో, మరెవరో దారిన పోయే దానయ్యో ఇటువంటి విమర్శలకు, వ్యాఖ్యలకు దిగితే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం అధికార పార్టీ నేతలకు ఉండకపోవచ్చు. కానీ మూడున్నర దశాబ్ధాలకు పైగా ఓ జిల్లా రాజకీయాలను శాసించి, ఏడాది క్రితం వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఓ సీనియర్ నాయకుడే పోలీసుల వ్యవహార శైలిని బాహాటంగా ప్రశ్నిస్తే? ప్రభుత్వ పాలన తీరును ఎండగడుతున్నట్లు భావించాల్సిందేనా? ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఇటువంటి వ్యాఖ్యలతో పోలీసుల తీరును ప్రశ్నించింది మరెవరో కాదు. అక్షరాలా అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఔను ఏడాది క్రితం వరకు కేసీఆర్ కు అత్యంత సన్నిహిత మంత్రిగా ప్రాచుర్యంపొంది, గత ఎన్నికల్లో అనూహ్య రీతిలో ఓటమి పాలైన తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ ప్రభుత్వంలో భాగమైన పోలీసుల వ్యవహార శైలిపై మంగళవారం ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.
‘నేను ఇన్ని సంవత్సరాలుగా అభివృద్ధి గురించే మాట్లాడాను తప్ప, అరాచకాల గురించి మాట్లాడడం అలవాటు లేదు. ఇటువంటి సంఘటనలు జరగడం అవమానకరం. ముఖ్యంగా పోలీసు అధికారుల ఇన్ స్ట్రక్షన్స్ తోటి గొడవ జరగడకుండా ఆపడానికి ప్రయత్నించిన జగదీష్ ను, రాజకీయ ప్రభోదంతో విపరీతమైనటువంటి సెక్షన్లు వాళ్ల ఇష్టమొచ్చినట్లు పెట్టి జైల్లో పెట్టించడమనేది మంచి పద్ధతి కాదు. రాజకీయాలు ఈ రోజు ఉంటయ్, రేపు ఉండవ్. జిల్లాలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, గత 35 సంవత్సరాలుగా అరాచకాలకు దూరంగా, అందరూ కలిసి, మెలిసి ఉండేవిధంగా, అభివృద్ధి తారక మంత్రంగా జిల్లా అభివద్ధి కోసం ప్రయత్నం చేశాను. హత్యలు, అరాచకాలు, అరిష్టాలు అన్నీ ఆగి పోయినయ్. కానీ చిల్లర రాజకీయాలతోటి ఇప్పుడు మళ్లీ మొదలయ్యే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితులు దాపురించకూడదని చెప్పి రాజకీయ పార్టీలకు, రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవేవీ శాశ్వతం కాదు, ఎవరు కూడా ఇటువంటి వాటిని హర్షించరు. వాటివల్ల ప్రజా ప్రయోజనం కూడా ఉండదు… కాబట్టి, దయచేసి మీ వ్యక్తిగత కక్షలను పార్టీకి నష్టం కలిగించే విధంగా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి, అభాగ్యుల మీద, సంఘటనతో సంబంధం లేని వ్యక్తులపై రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఈ రకమైనటువంటి అబద్ధపు కేసులు బిగిచ్చి, వాళ్లను కొద్ది రోజులు ఇబ్బంది పెట్టగలుగుతారుగాని, జీవితాంతం మీరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి, దయచేసి అటువంటి అరాచకమైనటువంటి పద్ధతులకు పూనుకోవద్దని రాజకీయాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ విజప్తిచేస్తూ…పోలీసు అధికారులు కూడా ఏది వాస్తవమైతే, ఆ వాస్తవానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తిస్తే మంచిది. నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, తప్పు చేయవద్దనేదే నేను గతంలో ఎప్పుడూ మీకు చెబుతుంటాను. అదే కొనసాగించండి తప్ప, మీ చిల్లర ప్రమోషన్ల కోసమో, చిల్లర ట్రాన్స్ఫర్ల కోసమో ఇటువంటి నిర్భాగ్యుల్ని, నిరాధారంతో కేసుల్లో పెట్టి, పెద్ద మనుషులు, ఆయన (జగదీష్) సర్పంచ్ చేశారు. గొడవ ఆపటానికి ప్రయత్నం చేయమని మీరే చెప్పారు, మీరే పంపించారు. ఆపటానికి వెళ్లిన వ్యక్తిని కూడా ఇన్నిసెక్షన్లతో కేసులు పెట్టి, నిర్బంధించటమనేది మీగ్గూడ మంచిది కాదని విజ్ఞప్తి చేస్తున్నా. దెబ్బలు తగిలినవాళ్లు జైల్లో ఉంటారు, కొట్టినోళ్లు బయట ఉండడమంటే హాస్యాస్పదంగా ఉంటది. ఇది ప్రభుత్వానికి, పార్టీకి మంచిది కాదు, మంచి పేరు రాదు.’
ఇవీ తుమ్మల నాగేశ్వరరావు ఓ సంఘటనకు సంబంధించి చేసిన తాజా వ్యాఖ్యలు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… ఖమ్మం రూరల్ మండలం అరెంపుల మాజీ సర్పంచ్ బండి జగదీష్ పై ఓ ఘర్షణ ఘటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లా జైలులో ఉన్నారు. జగదీష్ ను జైలుకు వెళ్లి పరామర్శించిన తుమ్మల మీడియాతో మాట్లాడుతూ పోలీసు వైఖరిని ఆక్షేపించారు. జగదీష్ జైలుపాలు కావడం వెనుక రాజకీయం ఉందనేది తుమ్మల వర్గీయుల ఆరోపణ. తుమ్మల వర్గీయులు రాజకీయ కోణంలో అనుమానిస్తున్న సదరు నాయకుడు కూడా అధికార పార్టీలోనే ఉండడం గమనార్హం. కాగా జైలులో గల జగదీష్ ను ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా సోమవారం పరామర్శించారు. కేసీఆర్ సారూ! కాస్త ఈ ఖమ్మం పాలిటిక్స్ ‘కత’ ఏమిటో చూడండి మరి. పోలీసుల తీరును మీ పార్టీ నేతలే నిందిస్తే ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టినట్లేనని ప్రజలు అనుకుంటున్నారు. అదీ సంగతి.