జర్నలిస్టులు ఏం చేస్తారు? ఏమవుతుంది జర్నలిస్టుల వల్ల? యాజమాన్యాలే మా చేతుల్లో ఉన్నాయి. మీరేం చేయలగలరు…? చాలా మంది నాయకులే కాదు, కొందరు ప్రభుత్వాధికారులు సైతం అనేక సందర్భాల్లో అహంకారపూరిత ధోరణితో చేసే వ్యాఖ్యలివి. కానీ జర్నలిస్టులకూ సమాజ బాధ్యత ఉంటుంది. అవసరమైనప్పుడు, సందర్భానుసారం సరైన సమయంలో సరైన రీతిలోనే అనేక మంది జర్నలిస్టులు స్పందిస్తుంటారు. ఇది చాలా సందర్భాల్లో రుజువైన సత్యం. జర్నలిస్టుల్లో కొందరు ‘లంపెనిస్టులు’ ఉండొచ్చు. అది వేరే విషయం. కానీ తాజా ఘటన గురించి చదవండి. కొందరు జర్నలిస్టుల కృషి ఓ పోలీసు నిండు ప్రాణాన్ని కాపాడింది. మావోయిస్టులకు చిక్కిన పోలీసు ప్రాణాన్ని కాపాడేందుకు ఛత్తీస్ గఢ్ అడవుల వెంట జర్నలిస్టులు పరుగెత్తారు. ఎట్టకేలకు వారి కృషి ఫలించింది. జవాన్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. వివరాల్లోకి వెడితే…
ఛత్తీస్ గఢ్ పోలీసు శాఖలోని సాంకేతిక విభాగంలో ‘ఎలక్ట్రిషియన్’గా కట్టం సంతోష్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఎలక్ట్రిషియన్ విధుల్లో ఉన్నప్పటికీ ఇటువంటి ఉద్యోగులకు పోలీసుగా హోదానే ఉంటుంది. భూపాలపట్నం ఠాణాలో పనిచేసే సంతోష్ ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఈనెల 4వ తేదీన తన స్నేహితులతో కలిసి గోర్న ఆలయంలో దైవ దర్శనానికి వెళ్లాడు. పూజలు నిర్వహిస్తున్న సంతోష్ కదలికలను పసిగట్టిన మావోయిస్టు నక్సల్స్ అతన్ని తమ వెంట తీసుకువెళ్లారు. ఓ రకంగా కిడ్నాప్ చేశారనే చెప్పాలి. దీంతో ఆందోళనకు గురైన సంతోష్ కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక విలేకరులను ఆశ్రయించారు. ఈనెల 11న నిర్వహించిన ‘ప్రజాకోర్టు’లో మావోలు సంతోష్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా విలేకరులు నక్సల్స్ తో చర్చలు జరిపారు. ప్రజా కోర్టులోనూ మెజారిటీ ప్రజలు సంతోష్ విడుదలకే మొగ్గు చూపుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అటు విలేకరుల మధ్యవర్తిత్వం, ఇటు మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు మావోయిస్టు నక్సల్స్ సంతోష్ ను విడుదల చేశారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాను అనుకుని ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంత విలేకరులు నివేదించిన వార్తా కథనపు సారాంశం ఇదే.
కానీ సంతోష్ అంశంలో ఛత్తీస్ గఢ్ లోని స్థానిక విలేకరుల కృషి మరుగున పడింది. సంతోష్ భార్య పోరాటం వల్లే అతన్ని నక్సల్స్ విడుదల చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థల సైట్లు కూడా తెగ ఊదరగొడుతున్నాయి. వాస్తవానికి సంతోష్ విడుదల అంశంలో స్థానిక జర్నలిస్టుల కృషి ఉందనేది కాదనలేని వాస్తవం. మావోయిస్టులంటే టెర్రరిస్టులు కాదు… రోజా సినిమాలో హీరోయిన్ తరహాలో పోరాడడానికి. వాళ్లు నక్సలైట్లు మాత్రమే. టెర్రరిజం వేరు… నక్సలిజం వేరు… సినిమా వేరు… నిజ జీవితం వేరు. ఈ రెండింటి మధ్య సారూప్యం తెలియని వారు తమదైన శైలిలో వార్తా కథనాలను వండి వారుస్తున్నారు. జర్నలిస్టుల కృషి వల్ల పోలీసులే కాదు, ‘పోలీస్ ఇన్ఫార్మర్లుగా’ ఆరోపణలు ఎదుర్కున్న కొందరు విలేకరులకూ నక్సలైట్ల నుంచి ప్రాణభిక్ష లభించిన ఘటనలు తెలంగాణా రాష్ట్రంలో ఉన్నాయి. అందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా గోవిందరావుపేటలో చోటు చేసుకున్న ఘటనలే నిదర్శనం.
పరిస్థితులు, పరిణామాలను బట్టి జర్నలిస్టులు తమ వంతు పాత్రను పోషిస్తుంటారు. అది గోవిందరావుపేట కావచ్చు… ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ అడవులు కావచ్చు. ఇటువంటి ఘటనల్లో కొందరి ప్రాణభిక్షకు కారణమైన విలేకరుల తపనకు, కష్టానికి ఎవరూ చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ల కృషి ఎన్నటికీ మరుగున పడకూడదు. ఇదే ఈ వార్తా కథనపు అసలు ఉద్ధేశం.