ఇండ్లను ఇసుక రేవులుగా మార్చేశారు. మున్నేరు నదిని నిలువునా తోడేసి గుట్టలు గుట్టలుగా ఇసుకను నిల్వ చేసుకున్నారు. ఎక్కడో కాదు… ఖమ్మం నగరానికి అత్యంత సమీపంలోనే. నగరం నడిబొడ్డు నుంచి ప్రవహించే మున్నేరు నదే వారికి కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. ప్రజల అవసరాలే లక్ష్యంగా సొమ్ము చేసుకుంటున్న ఇసుకాసురుల దందాను మూడు విభాగాలకు చెందిన ప్రభుత్వాధికారులు శనివారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెడితే..
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధశిరి గ్రామానికి చెందిన అనేక మంది ఇసుక మాఫియాగా తయారయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా రేయీ, పగలనే తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణాకు తెగబడ్డారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు, ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు పావులు కదిపారు. ఇందుకు మున్నేరు నదిని టార్గెట్ చేసుకున్నారు. గ్రామానికి అత్యంత సమీపంలోనే గల నది నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తోడేసి, తరలించి తమ తమ నివాస గృహాల్లో గుట్టలుగా నిల్వ చేశారు. వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఈ ఇసుకను అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రభుత్వాధికారులు గుర్తించారు.
ఈమేరకు పోలీసు, రెవెన్యూ, మైనింగ్ విభాగాలకు చెందిన అధికారులు గంధశిరి గ్రామంపై మెరుపు దాడులు చేశారు. గ్రామంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లల్లో భారీ ఎత్తున నిల్వచేసిన ఇసుక గుట్టలను కనుగొన్నారు. ఇసుక రీచ్ లను మరిపించే విధంగా నిల్వచేసిన ఇసుక గుట్టలను చూసి అధికారులు నివ్వెరపోయారు. సుమారు 350 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను అధికారులు సీజ్ చేశారు. తనిఖీల్లో మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ తోపాటు ముదిగొండ తహశీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ నరేష్ పాల్గొని ఇసుకను సీజ్ చేసినట్లు ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
గంధశిరిలో గుట్టలుగా కనిపిస్తున్న ఇసుక నిల్వల తీరును దిగువన గల వీడియోలో చూడండి.