అనేక అక్షరాల్లో చెప్పలేని భావాన్ని ఓ కార్టూన్ ద్వారా చెప్పొచ్చు. పేరాల కొద్దీ రాసి, పేజీలు నింపే వార్తా కథనంకన్నా, కొందరు గీసే వ్యంగ్య చిత్రాలు (కార్టూన్లు) భలే పేలుతుంటాయ్. కార్టూన్ల విషయంలో ఇదేమీ సరికొత్త నిర్వచనం కాదు. కార్టూన్లు గీసే వారిలో సమయస్ఫూర్తి ఉండాలి. బర్నింగ్ ఇష్యూస్ భావాలను ఒడుపుగా పట్టుకుని గీసే కార్టూన్లు భలే ఆకట్టుకుంటాయ్. కాకపోతే అది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కొందరు కార్టూనిస్టులు మాత్రమే ఈ అంశంలో ‘బ్రష్’ తిరిగి ఉంటారు.
ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో వాదించడం చేతగాని వ్యక్తి తన తరపున వాదిస్తారని లాయర్ ను వెంటేసుకుని స్టూడియోకు వెడితే…?, వరదల్లో పీకల్లోతు వరకు మునిగిన వ్యక్తిని ‘ఎలా ఫీలవుతున్నారు..? అని జర్నలిస్టు ప్రశ్నిస్తే, దోపిడీ సొత్తుతో వెడుతున్న దొంగ వ్యక్తిగతంగా నన్ను టార్టెట్ గా చేసి అరెస్ట్ చేయడానికి వచ్చారా…? అని పోలీసు అధికారినే ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో పైడి శ్రీనివాస్ గీసిన ఈ వ్యంగ్య చిత్రాలను ఓసారి తీక్షణంగా చూడండి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న పైడి శ్రీనివాస్ కార్టూన్లలో ఇవి కొన్ని మాత్రమే.