నకిలీ విత్తనాలపై కొరడా ఝుళిపిస్తున్న తెలంగాణా ప్రభుత్వానికి సవాల్ వంటి అక్రమ దందా ఇది. లేని ఫ్యాక్టరీ ఉన్నట్లు చూపుతూ, అనుమతి లేని ఎరువుల తయారీ ద్వారా రూ. కోట్లు గడిస్తున్న సంస్థ బాగోతమిది. గడచిన తొమ్మిదేళ్లుగా సాగుతున్న ఈ అక్రమ వ్యవహారంపై వ్యవసాయ శాఖ చోద్యం చూస్తుండడమే అసలు విశేషం. తెలంగాణాలోని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి కేంద్రంగా ఆంధప్రదేశ్ వ్యాపారి ఒకరు సాగిస్తున్న అక్రమ ఎరువుల వ్యాపారం తీరుతెన్నులపై పోలీసు శాఖ సైతం నివ్వెరపోయినట్లు సమాచారం. ఈ అక్రమ వ్యాపార బాగోతంలో ఇప్పటికే ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… గడచిన తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలాన్ని కేంద్రంగా చేసుుకుని అక్రమ ఎరువుల దందాను కొనసాగిస్తున్నాడు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కేంద్రంగా ఓ ప్రయివేట్ ఎరువుల ఫ్యాక్టరీకి అప్పట్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. వివిధ రకాల ఎరువులను ‘మిక్సింగ్’ చేసి తమదైన ‘బ్రాండ్’గా ఎరువులను విక్రయించడమే ఈ ఫ్యాక్టరీ ప్రధాన వ్యాపారంగా తెలుస్తోంది. అయితే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక తెలంగాణాలో ఈ ఫ్యాక్టరీకి ఎటువంటి అనుమతి లభించలేదు. కానీ పెనుబల్లి మండలం టేకులపల్లి కేంద్రంగా ఫ్యాక్టరీ ఉన్నట్లు స్థానికంగా ఏర్పాటు చేసిన బోర్డు ద్వారా ప్రకటించడం గమనార్హం.
వాస్తవానికి టేకులపల్లిలో ఎరువుల ఫ్యాక్టరీ ఏర్పాటుకు మిషనరీని కూడా తెప్పించారు. అయితే తెలంగాణా ప్రభుత్వ పరంగా ఎటువంటి అనుమతి లభించకపోవడంతో ఓ రేకుల షెడ్డులో దించిన మిషనరీ తుప్పు పట్టిపోయినట్లు సమాచారం. కానీ హనుమాన్ జంక్షన్ లో గల ఈ ఫ్యాక్టరీ తయారు చేస్తున్నట్లు చెబుతున్న ఎరువులను తెలంగాణాలో విక్రయించుకోవడానికి వ్యవసాయ శాఖ ‘సేల్ పర్మిషన్’ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెనుబల్లిలోని బోర్డులో పేర్కొన్న ప్రదేశంలో ఫ్యాక్టరీకే అనుమతి లేని పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ సేల్ పర్మిషన్ ఎలా ఇచ్చిందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ ఫ్యాక్టరీ తయారు చేసే సుమారు 10 రకాల ఎరువుల ఉత్పత్తులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత పరిణామాల్లో కేవలం రెండు ఉత్పత్తుల తయారీకి మాత్రమే అక్కడి ప్రభుత్వం అనుమతిని పరిమితం చేసి, మిగతావాటిని నిషేదించినట్లు తెలుస్తున్నది.
అయినప్పటికీ ఈ ఎరువుల ఫ్యాక్టరీ నిర్వాహకులు ఆంధప్రదేశ్ ప్రభుత్వం అనుమతి రద్దు చేసినట్లు పేర్కొంటున్న ఎనిమిది రకాల ఎరువులు సహా మొత్తం పది రకాల ఉత్పత్తులను తెలంగాణా రైతాంగానికి అక్రమంగా విక్రయిస్తూ అంటగడుతున్నట్లు తెలిసింది. హనుమాన్ జంక్షన్ ఫ్యాక్టరీలో మాత్రమే తయారవుతున్న ఎరువుల రకాలను పెనుబల్లి కేంద్రంగా వ్యాపారం సాగుతున్నట్లు పేర్కొంటూ నేరుగా రైతులకు అంటగట్టడం చట్టవ్యతిరేకంగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పెనుబల్లిలో స్టాక్ పాయింటును ఏర్పాటు చేసుకుని నిర్వహించాల్సిన పరిమితి ఉత్పత్తుల విధానానికి విరుద్ధంగా ఈ సంస్థ సాగిస్తున్న వ్యాపారంపై పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. పెనుబల్లి మండలాన్ని కేంద్రంగా చేసుకుని సాగిస్తున్న ఈ అక్రమ దందాకు ఉమ్మడి ఆదిలాబాద్ నే తమ వ్యాపార కేంద్రంగా నిర్వాహకులు ఎంచుకున్నట్లు పోలీసులు కనుగొన్నట్లు తెలిసింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ తదితర ప్రాంతాలకు ఇప్పటికే రూ. 3.00 కోట్ల విలువైన రెండు వేల టన్నుల ఎరువులను అక్రమంగా విక్రయించినట్లు తెలుస్తోంది. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా, ప్రత్యేక తెలంగాణాలోనూ ఏడేళ్లుగా సాగుతున్న ఈ అక్రమ ఎరువుల దందాపై వ్యవసాయ శాఖ ప్రేక్షక పాత్రను పోషించడంపైనా విమర్శలు వస్తున్నాయి. మొత్తం అక్రమ దందాపై ఖమ్మం పోలీసులు కూపీ లాగుతున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో పోలీసులు ఈ అక్రమ దందాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా లేని ఫ్యాక్టరీని ఉన్నట్లు చూపుతూ, అనుమతి లేని ఎరువులను తెలంగాణా రైతాంగాన్ని అంటగడుతూ కోట్లు గడిస్తున్న అక్రమ వ్యాపారం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.