తమపై బెంద్రం తిరుపతిరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై, చేసిన ఆరోపణలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీసులు వివరణ ఇచ్చారు. ఈమేరకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పేరుతో గత రాత్రి పొద్దుపోయాక ఓ ప్రకటన విడుదలైంది.
ఇల్లంతకుంట మండలానికి చెందిన బెంద్రం తిరుపతి రెడ్డి అనే వ్యక్తి , తన పర్సనల్ బాండ్, అఫిడవిట్లను దొంగిలించారని, వాటిని నిజ ప్రతిగా నిర్దారణ చేశారని ఇల్లంతకుంటకు చెందిన పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలతో కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని అన్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఫిర్యాదుదారుడు పలు కేసులలో నిందితుడుగా ఉన్నాడని,15 కేసులలో ఇతని ప్రమేయం ఉందన్నారు. గత ఏప్రిల్ 19వ తేదీన ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పై దాడి అంశంలో బెంద్రం తిరుపతి రెడ్డిపై, అతని అనుచరులపై కేసు నంబరు 100/21 ద్వారా నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి సహా నిందితులుగా ఉన్న వ్యక్తుల నుంచి సత్ప్రవర్తనకు సంంధించి పర్సనల్ బాండ్ తీసుకున్నారని పేర్కొన్నారు.
అయితే న్యాయస్థానం వారికి ఇచ్చిన బాండ్ నిబంధనలను ఉల్లంఘించి జూలై 16వ తేదీన తిరిగి నేరాలకు పాల్పడ్డాడని, ఈ విషయంలో క్రైం నెం. 193/21, 194/21ల ద్వారా నమోదు చేసి బెంద్రం తిరుపతి రెడ్డిని, మరో నిందితున్ని రిమాండ్ చేస్తూ సిరిసిల్ల న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా, అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండు విధించగా, కరీంనగర్ జైలుకు వెళ్లారని వివరించారు.
ఈ నేపథ్యంలో కేవలం తమను జైలుకు పంపారనే కోపంతో, అక్కసుతో పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇల్లంతకుంట స్టేషన్ హౌస్ ఆఫీసర్ పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తులపై చట్టపరంగా తగిన చర్య తీసుకుంటామని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు.