ఐడీ పార్టీ పోలీసుల డ్యూటీ ఏమిటి? దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడే దుండగులను, ముఠాల ఆచూకీని కనిపెట్టడం, వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం, కోర్టుకు స్వాధీనపర్చడం ఇదేగా ఐడీ పార్టీ పోలీసుల ప్రధాన విధినిర్వహణ? కానీ ఇదే విభాగంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ చోరీ సొత్తుకు ఆశపడితే…? కోర్టు పరిధిలో గల వస్తువును మాయం చేస్తే…? నేరుగా చెప్పాలంటే చోరీ సొత్తును దొంగతనం చేస్తే…? చట్టం ఊర్కోదు కదా…? తన పని తాను చేసుకుపోతుంది. ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరిగ్గా ఇటువంటి సంఘటనే జరిగింది. వివరాల్లోకి వెడితే…
ఖమ్మం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో రాజు అనే కానిస్టేబుల్ గతంలో ఐడీ పార్టీ విభాగంలో పని చేసేవాడు. 2018 సంవత్సరంలో ఈ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం సంఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి చోరీకి గురైన సొత్తుతోపాటు ఓ సెల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. కానీ కోర్టు పరిధిలో గల ఈ చోరీ సొత్తులోని సెల్ ఫోన్ మాత్రం మాయమైంది. దీంతో కోర్టు విచారణకు ఆదేశించింది.
ఈమేరకు ఖమ్మం టూటౌన్ సీఐ తుమ్మ గోపి లోతుగా దర్యాప్తు జరిపి సెల్ ఫోన్ చోరీ చేసిన వ్యక్తిని కనిపెట్టేశారు. అతనెవరో కాదు అప్పట్లో ఐడీ పార్టీ విభాగంలో పనిచేసిన కానిస్టేబుల్ రాజే. కోర్టు పరిధిలో గల సెల్ ఫోన్ ను కానిస్టేబుల్ రాజు దొంగతనం చేశాడని దర్యాప్తులో తేలడంతో మంగళవారం అతన్ని సీఐ గోపి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. రాజు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మరో ఠాణాలో పనిచేస్తున్నాడు.