ఓ మహిళపై అత్యాచారం చేశాడనే అభియోగంపై ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి ఒకరు కొద్దిసేపటి క్రితం సస్పెన్షన్ కు గురయ్యారు. ఓ జిల్లాకు కలెక్టర్ గా వ్యవహరించిన సందర్భంగా అతనిపై వచ్చిన అత్యాచారం ఆరోపణలను ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ తీవ్రంగా పరిగణించి ఈ చర్య తీసుకున్నారు. వెంటనే అతని సస్పెన్షన్ కు ఉత్తర్వులు జారీ చేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర అధికార వర్గాల్లో తీవ్ర కలకలానికి కారణమైన సంఘటన పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి.
తన భర్తను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించి ఓ ఐఏఎస్ అధికారి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 33 ఏళ్ల మహిళ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కున్న నిందితుడు జనక్ ప్రసాద్ పాథక్ ఛత్తీస్ గఢ్ లోని జంజ్ గిర్-చంపా జిల్లా మాజీ కలెక్టర్. ప్రస్తుతం ఈయన ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వ సర్వీసులో గల తన భర్తను ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించి గత మే 15వ తేదీన అప్పటి కలెక్టర్ పాథక్ తనపై కలెక్టరేట్ లోనే అత్యాచారం చేశాడని, ఇలా ఒక్కసారి కాదని అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ మహిళ జంజ్ గిర్ – చంపా జిల్లా ఎస్పీ పరుల్ మాథుర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు బాధిత మహిళకు అశ్లీల మెసేజ్ లను కూడా పంపాడని, ఈమేరకు బాధితురాలు తన ఫోన్ నుంచి స్క్రీన్ షాట్లను కూడా తీసి తమకు అందించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ప్రాథమిక విచారణ అనంతరం జంజ్ గిర్ – చంపా జిల్లా మాజీ కలెక్టర్ జనక్ ప్రసాద్ పాథక్ పై ఐపీసీ 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ నేపథ్యంలోనే గత నెల 26న జంజ్ గిర్-చంపా జిల్లా నుంచి కలెక్టర్ బాధ్యతల నుంచి పాథక్ బదిలీ అయ్యారు. ఐఏఎస్ అధికారిపై వచ్చిన అత్యాచారం ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాగెల్ కొద్ది సేపటి క్రితం అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.