వాళ్లిద్దరూ ఉన్నతాధికారులు. ఒకరు ఐఏఎస్, మరొకరు ఐపీఎస్. ఈ ఇద్దరూ కోరుకుంటే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇందుకు విరుద్ధంగా జిల్లా కలెక్టరేట్ లోని ఓ గదిలో నిరాడంబరంగా పూలదండలు మార్చుకుని వివాహం చేసుకోవడమే వార్తాంశంగా మారింది. వివరాల్లోకి వెడితే…
ఛత్తీస్ గఢ్ లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ నమ్రత జైన్, ఐపీఎస్ అధికారి నిఖిల్ రాఖేచా పరస్పరం ఇష్టపడ్డారు. వివాహ బంధంలోకి అడుగిడాలని నిర్ణయించుకుని ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలోని కలెక్టరేట్ గదిలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో కలెక్టరేట్ లో విధులు నిర్వహించే అధికారులందరూ అక్కడే ఉండడం విశేషం.
జిల్లా కలెక్టర్ దోమన్ సింగ్, ఎస్పీ దివ్యాంగ్ పటేల్, జిల్లా పంచాయితీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిఖిల్, నమ్రతల వివాహానికి హాజరయ్యారు. నమ్రత జైన్ ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలోని గీదం ప్రాంతానికి చెందినవారు కావడం మరో విశేషం.
ఫొటో: బస్తర్ కీ ఆవాజ్ సౌజన్యంతో…