తెలంగాణాలో కొందరు సివిల్ సర్వీసు అధికారుల వ్యవహార శైలి మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ దాఖలు చేసిన వివిధ అఫిడవిట్లపై హైకోర్టు ఇప్పటికే ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా? తాజాగా సునీల్ శర్మను టార్గెట్ చేస్తూ ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలతో కలిసి తెలంగాణా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు విపక్షాలు కుట్ర పన్నాయని సునీల్ శర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ భగ్గుమన్నారు. కుట్రకు సంబంధించి ఆధారాలుంటే తమను జైలుకు పంపాలని ఉత్తమ్ సీరియస్ కాగా, సునీల్ శర్మ ఆర్టీసీ ఎండీనా? లేక టీఆర్ఎస్ కార్యకర్తా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. సునీల్ శర్మ వ్యవహార శైలిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని, పార్లమెంట్ లోనూ ప్రస్తావిస్తామని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొందరు సివిల్ సర్వీసెస్ అధికారుల వ్యవహారం శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి సివిల్ సర్వీసెస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల్లో తమ సేవలు అందించడానికి కేటాయింపు ప్రాతిపదికన వస్తుంటారు. వీరి క్రమ శిక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షణ చేస్తుంది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులకు సంబంధించి డీవోపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్), ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఎంహెచ్ఏ (మినిస్ట్రీ ఆఫ్ హోం అఫయిర్స్) విభాగాలు ఉంటాయి. డీవోపీటీ ప్రధాని, ఎహెచ్ఏ హోం మంత్రి పర్యవేక్షణలో ఉంటాయి. సివిల్ సర్వీసెస్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కేంద్రం అనుమతి లేకుండా వీరిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. ఈ నేపథ్యంలో రాజ్యాంగబద్ద హోదాల్లో గల సివిల్ సర్వీసెస్ అధికారులు అందుకు అనుగుణంగానే నడుచుకుంటున్నారా? అనే అంశంపై ఈ సందర్భంగా భిన్నాభిప్రాయులు ఉన్నాయి. కొద్ది రోజుల వ్యవధిలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల తీరుపై అటు అధికారపక్షం, ఇటు విపక్ష పార్టీలు విమర్శలు చేస్తుండడమే ఇందుకు కారణం.
కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై మంత్రి గంగుల కమలాకర్, అతని అనుచరులు తీవ్ర స్థాయిలో అగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే కదా? బీజేపీకి చెందిన ఎంపీ బండి సంజయ్ కుమార్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ల మధ్య జరిగినట్లు పేర్కొంటున్న సంభాషణకు సంబంధించిన ఆడియో రాజకీయ దుమారం రేపుతోంది. ఎన్నికల అధికారిగా విధుల్లో గల కలెక్టర్ వ్యవహార తీరుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని మంత్రి గంగుల ప్రకటించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి వ్యవహారం శైలిపై అధికార పార్టీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలోనే ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ తీరుపై విపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించాయి.
కేంద్ర సిబ్బంది శిక్షణా విభాగంగా వ్యవహరించే డీవోపీటీ సివిల్ సర్వీస్ అధికారుల వ్యవహార శైలికి సంబంధించి అత్యంత కీలక శాఖగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఐఏఎస్ అధికారులపై ఈ విభాగానికి ఫిర్యాదులు అందితే… విచారణ జరిగితే…అధికారి తప్పు ఉన్నట్లు తేలితే ప్రభుత్వం తీసుకునే చర్యలు కఠినంగానే ఉంటాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ చర్య ఏ విధంగానైనా ఉండవచ్చంటున్నారు. అయితే ఇదేమీ అంత సులువు కాదని మరో ఉన్నతాధికారి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో సివిల్ సర్వీసెస్ అధికారులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ ఆజమాయిషీలో విధుల్లో ఉన్నంతకాలం వారికి తప్పకుండా రక్షణ ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఆరోపణలు, విమర్శలు ఎదుర్కున్న అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లినపుడు మాత్రం వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని మరో ఉన్నతాధికారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రమే సునీల్ శర్మ అఫిడవిట్ దాఖలు చేశారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఆర్టీసీ ఎండీ దాఖలు చేసినట్లు పేర్కుంటున్న అఫిడవిట్ ను పరిశీలించి, విపక్షాలు కుట్ర చేశాయనడానికి ఆధారాలు ఏమిటని హైకోర్టు ప్రశ్నిస్తే మాత్రం సమాధాన చెప్పక తప్పదని న్యాయవాద వర్గాలు పేర్కొన్నాయి. సర్కార్ ను అస్థిర పరిచే కుట్ర అంటే రాజద్రోహం కిందకు వస్తుందని, కోర్టు ప్రశ్నిస్తే అధారాలు చూపాల్సి ఉంటుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.