దేనికైనా కాస్త క్రియేటివిటీ ఉండాలి. లేకుంటే ప్రజలు గుర్తించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. హైదరాబాద్ నగరంలో అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలోని అక్షరాలను పొల్లు పోకుండా చదవండి. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపరుస్తున్న కరోనా వైరస్ కు మందుల పంపిణీ (?) కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. వైరస్ ను గుర్తించే పరికరాలే మన దగ్గర లేవని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే స్పష్టం చేయగా, వీళ్లు మాత్రం వ్యాధి సోకకుండా ఏకంగా మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్ లను కూడా పిలిచినట్లున్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు పంపిణీ చేసిన మందులు అల్లోపతా? హోమియోపతా? నాచురోపతా? యునానినా? అని మాత్రం అడక్కండి. ఎందుకంటే వాళ్లు పంపిణీ చేసిన మందులు ‘కరోనా’ వైరస్ కు కాదు. ‘కోరుల్లా’ వైరస్ సోకిన వారికి మాత్రమే. ఇదేం వైరస్? అని సందేహిస్తున్నారు కదూ? ముషీరాబాద్ టీఆర్ఎస్ నేతలు కనిపెట్టిన కొత్త వైరస్ కాబోలు. అందుకే మొదట్లోనే ‘అబ్బబ్బబ్బబ్బా…ఇలాంటి ఫ్లెక్సీ…నెవ్వర్ బిఫోర్… ఎవ్వర్ ఆప్టర్’ అని శీర్షీకరించింది. విషయం మీకు అర్థమవుతోంది కదూ? లేదంటే ఫ్లెక్సీని మళ్లీ ఓసారి చదవండి.