దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘దిశ’ ఘటనలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే ఏం చెప్పారు? మీడియా ముసుగులో దారితప్పి వ్యవహరించే తీరును వేలెత్తి చూపుతూ అప్పట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దిశ’ ఘటనలో మీడియా వార్తా కథనాల ప్రసారాలకు సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన నోటీసుల ప్రస్తావన సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘మీడియాకు మాట్లాడే హక్కు ఉంటుంది’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ అదే సమయంలో మీడియా ప్రత్యేకించి ‘సదరు వ్యక్తి చేసింది తప్పు’ అని చెప్పేలా ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ఆయా సందర్భంగా పేర్కొన్నారు. ‘మీడియాకు మాట్లాడే హక్కు మాత్రమే ఉంది…ఫలానా వ్యక్తి చేసింది తప్పు’ అని తమదైన శైలిలో తీర్పు చెప్పే హక్కు లేదన్న మాట. ఇప్పుడీ వ్యాఖ్యల ప్రస్తావన దేనికంటే…?
హైదరాబాద్ శివార్లలో బీ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం ఘటనను రాచకొండ పోలీసులు నిగ్గు తేల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మీడియా, ముఖ్యంగా తెలుగు మీడియాకు చెందిన పలు వార్తా సంస్థలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆటోలో అరాచకం… అంటూ ఓ న్యూస్ ఛానెల్ హెడింగ్ పెడితే.., ఆటోలో అత్యాచారం… అంటూ ఇంకో ఛానెల్, ఆటోలోనే కాటేసిన కామాంధులు… అంటూ బీభత్సపు శీర్షికలతో హడలెత్తించిన వైనంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయ్. మరో న్యూస్ ఛానల్ ఇంకో అడుగు ముందుకేసి పోలీసుల ఉరుకులు పరుగులు, సీసీ కెమెరాల పనితీరు, నెల రోజుల ముందు నుండే సామూహిక అత్యాచారం కోసం ‘రెక్కీ’ (?) నిర్వహించారని తేల్చేస్తూ వార్తా కథనాలను వండి వడ్డించారు. ‘మ్యాటర్ రెడీ’గా ఉందంటూ కోడ్ భాషలో కమ్యూనికేట్ చేసి యువతిని ఒంటరి చేసి మత్తు మందిచ్చి అత్యాచారం చేశారంటూ వరుస కథనాలతో అనేక న్యూస్ ఛానెల్స్ వార్తలను రసవత్తర భాషతో తమ వీక్షకులకు వడ్డించాయి. బాధితురాలిగా పేర్కొన్న యువతిని, ఘటనలో అనుమానిస్తూ కొందరు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు గుట్టు రట్టయింది. డ్రైవర్ల సెల్ ఫోన్ సిగ్నల్స్, అమ్మాయి సెల్ ఫోన్ సిగ్నల్స్ కి సంబంధం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. కానీ విపరీత పోటీతత్వం పెరిగిన వర్తమాన జర్నలిజంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు విరుద్ధంగా ‘తీర్పరి’ తరహాలో కొన్ని మీడియా సంస్థలు వార్తా కథనాలను వడ్డించడంపై సహజమైన విమర్శలే వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల లోతైన దర్యాప్తులో బీ ఫార్మసీ విద్యార్థిని చెప్పింది బూటకమని తేలింది…. ఒక వేళ సీసీ టీవీ ఫుటేజీ లేకుంటే? సమాజం దృష్టిలో మీడియా నిందితులుగా చూపిన ఆటో డ్రైవర్లు అవమానాన్ని తట్టుకోలేక ఎవరైనా అనూహ్యంగా ఏదేని అఘాయిత్యాలకు పాల్పడితే? అందుకు బాధ్యులెవరు? మీడియా తీర్పరుల అత్యుత్సాహంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలివి.
ఈ ఘటనలో గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే…? రాచకొండ పోలీస్ కమిషనర్ ఎంఎం భగవత్ ఆటో డ్రైవర్లకు క్షమాపణ చెప్పారు. యువతి చెప్పిన వివరాల కారణంగా అదుపులోకి తీసుకున్న ఆటో డ్రైవర్లను విచారించామని, ఈ కేసులో తాము అదుపులోకి తీసుకున్న అయిదుగురు ఆటో డ్రైవర్లకు ఎటువంటి సంబంధంగాని, ప్రమేయంగాని లేదని తమ దర్యాప్తులో తేలిందన్నారు. తాము విచారణ జరిపిన సందర్భంగా ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయారని, వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా రూ. వెయ్యి ఆర్థిక సాయంతోపాటు బియ్యాన్ని కూడా అందించామన్నారు. మీడియా కథనాలతో ఆటో యూనియన్లు ఆందోళన చెందాయని, ఒకానొక దశలో మీడియాకు వ్యతిరేంకగా పోలీస్ స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లు ధర్నాకు సిద్ధమయ్యారని రాచకొండ సీపీ భగవత్ ప్రకటించడం గమనార్హం. ఈ సంఘటనలో భగవంత్ వంటి సీనియర్ ఐపీఎస్ అధికారి ఆటో డ్రైవర్లకు క్షమాపణ చెప్పిన బాటను ‘మీడియా తీర్పరులు’ స్ఫూర్తిగా స్వీకరిస్తారా? అనేది సందేహాస్పదమే. ఎందుకంటే తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు చందాన కొందరు జర్నలిస్టుల తీరు అనేక సందర్భాల్లో విమర్శల పాలైంది. క్రైం వార్తల రిపోర్టింగ్ లో పోలీసుల కదలికలను, దర్యాప్తు తీరును ప్రామాణికంగా తీసుకోకుండా తమదైన శైలిలో వార్తా కథనాలను వండివార్చే మీడియా తీర్పరులకు ఈ ఘటన ఓ గుణపాఠంగా అభివర్ణించక తప్పదు. ముఖ్యంగా ‘సీన్ రీ కన్ స్ట్రక్షన్’ అనే పదం కూడా తెలియని సోకాల్డ్ జర్నలిస్టుల క్రైం రిపోర్టింగ్ తీరు నవ్వులపాలు కాక మరేమవుతుందన్నది అసలు ప్రశ్న.