హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ నూతన కార్యవర్గం ఆదిలోనే తప్పటడుగు వేసిందా? ఇదే నిజమైతే ఈ ధోరణితో నూతన కార్యవర్గం సొసైటీలోని సభ్యుల ఆకాంక్షను నెరవేరుస్తుందా? ఎంతో నమ్మకంతో వందలాది మంది జర్నలిస్టులు ఎన్నుకున్న కొత్త కార్యవర్గం తొలి అడుగులోనే సరైన దిశగా పయనించడం లేదా? ఇటువంటి అనేక ప్రశ్నలు జర్నలిస్టు సర్కిళ్లలో రేకెత్తుతున్నాయి.
విషయంలోకి వెడితే.. అనేక పోరాటాల మధ్య, చాలా కాలం తర్వాత జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీకి ఈనెల 18వ తేదీన ఎన్నికలు జరిగాయి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి తెలిసిందే. ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు లభించే అంశంలో జర్నలిస్టులకు ఓరకంగా ఆశలు సన్నగిల్లాయి కూడా. అయినప్పటికీ జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ ఎన్నికల్లో వందలాది మంది జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తాము ఎన్నుకునే కార్యవర్గం తమ ఆశలను తీరుస్తుందనే విశ్వాసంతో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
సొసైటీ ఎన్నికల్లో బ్రహ్మాండభేరి గోపరాజు ప్యానల్ విజయం సాధించింది. తొమ్మిది మంది డైరెక్టర్లలో ఆరుగురు గోపరాజు ప్యానల్ నుంచే ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ప్రక్రియలో సొసైటీ అధ్యక్షునిగా బి. గోపరాజు, ఉపాధ్యక్షునిగా ఎం. లక్ష్మినారాయణ, కార్యదర్శిగా ఎం. రవీంద్రబాబు, జాయింట్ సెక్రెటరీగా సిహెచ్. భాగ్యలక్ష్మి, కోశాధికారిగా బి. మహేశ్వర్ ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా డి. కమలాకరచార్య, డి. వెంకటాచారి, హష్మీ, స్వేచ్ఛలు ఎన్నికయ్యారు.
అనేక ఉత్కంఠ పరిణామాల మధ్య ఎన్నికైన నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం లేదా పదవీ బాధ్యతల కార్యక్రమాన్ని ఈనెల 25వ తేదీన నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రత్యేక అతిథిగా మీడియా అకాడమీ చైర్మెన్ కె. శ్రీనివాసరెడ్డి హాజరవుతున్నట్లు ఆహ్వాన పత్రికలో సొసైటీ కార్యవర్గం ప్రకటించింది.
అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానించాల్సిన ముఖ్య అతిథులు, అతిథుల విషయంలో సొసైటీ కొత్త కార్యవర్గం సరైన దిశలో పయనించడం లేదా? అనే ప్రశ్నలు జర్నలిస్టు సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి వ్యవహారాల్లో సంబంధిత శాఖల మంత్రులను ఆహ్వానించకుండా నిర్వహించే కార్యక్రమం ద్వారా ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయా? అనేది అసలు ప్రశ్న. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, తెలంగాణా రాష్ట్రంలోనూ జూబ్లీహిల్స్ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీది దశాబ్ధాల ప్రత్యేక చరిత్ర, స్థానం కూడా.
ఇటువంటి విశేష చారిత్రక నేపథ్యం గల సొసైటీ కొత్త కార్యవర్గం ప్రమాణ, పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వంటి నాయకున్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి జర్నలిస్టుల ఆకాంక్షను, ఆశలను నూతన కమిటీ వ్యక్తీకరించాల్సిన సందర్భోచిత వేదిక ఇది. సీఎం స్థాయి నాయకుడి అపాయింట్ మెంట్ దొరకలేదని భావించినా, సంబంధిత శాఖలకు చెందిన మంత్రులనైనా ఆహ్వానిస్తే బాగుండేదని జర్నలిస్టు వర్గాల వాదన.
హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ ను కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా పిలవడంపై జర్నలిస్టులెవరికీ అభ్యంతరం లేదు. కానీ సమాచార శాఖను నిర్వహిస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, సహకార శాఖను నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును ఈ కార్యక్రమానికి ఆహ్వానించాల్సిన బాధ్యతను కొత్త కార్యవర్గం విస్మరించిందా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంతో సమాచార శాఖకు, సహకార శాఖకు కూడా సొసైటీ బాధ్యతల నిర్వాహణతో ముడిపడి ఉన్నాయనేది కాదనలేని వాస్తవం. ఈ పరిస్థితుల్లో ఈ ఇద్దరు కీలక మంత్రులను కొత్త కార్యవర్గం ఆహ్వానించకపోవడమేంటనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.
ఇదే అంశంపై సొసైటీ నూతన అధ్యక్షుడు బి. గోపరాజును ts29 సంప్రదించగా, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులను ఆహ్వానించేందుకు తాము సంప్రదించామని, కార్యక్రమానికి హాజరయ్యేందుకు తీరిక లేదని మంత్రులు చెప్పారని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ కారణంగా మంత్రులు రావడానికి వీలు కాలేదని ఆయన చెప్పారు. అనివార్యంగా హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ ను చీఫ్ గెస్టుగా ఆహ్వానించినట్లు గోపరాజు వెల్లడించారు.
కాగా జూబ్లీ హిల్స్ హౌజింగ్ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ, పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు తమకు ఎటువంటి ఆహ్వానం అందలేదని అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు తుమ్మల నాగేశ్వర్ రావు కార్యాలయ వర్గాలు ts29తో చెప్పాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా పరిశీలించినపుడు సంబంధిత శాఖల మంత్రుల సహకారం లేకుండా ఇళ్ల స్థలాల సాధన ఎలా సాధ్యమనే ప్రశ్నలు సహజంగానే ఉద్భవిస్తున్నాయి. దీంతో తొలి అడుగులోనే జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ తప్పటడుగు వేసిందా? అనే ప్రశ్న కూడా రేకెత్తుతోంది.