సినిమా రంగానికి చెందిన కొందరి తీరును నిలబెట్టి ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా పోస్ట్ ఇది. దిశ ఘటనలో నిందితుల ఎన్కౌంటర్ ను సమర్థించే హక్కు మీకుందా? అని ప్రశ్నిస్తున్నాడు ఎవరో తెలియని ఈ పోస్ట్ రచయిత. కానీ ఇతని ప్రశ్నలో ఆలోచింపజేసే అంశాలున్నాయి. నీతులు చెప్పడం సరే, మీరేం చేస్తున్నారో తెలుసా? అంటూ వేలెత్తి చూపుతున్న ప్రశ్నలు అనేకం. యువతను వికృత ఆలోచనలకు పురిగొల్పుతున్నపాపంలో మీకూ భాగస్వామ్యం లేదా? అని ప్రశ్నిస్తున్న ఈ సోషల్ మీడియా పోస్ట్ సినీ పరిశ్రమలోని అనేక మంది ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవశ్యకతను గుర్తు చేస్తోంది. అదేమిటో మీరూ చదవండి.
మహా నటులు, నటీమణులు, నిర్మాతలూ, దర్శకులు, మీకు అసలు దిశ నిందితుల encounter ను సమర్థించే హక్కుందా?
మీ సినిమా రంగంలో ఆడవారికి ఉన్న విలువ ఏమిటి అనేది మీ గుండెల మీద చేయ్యేసుకుని నిజం చెప్పగలరా? మీరు నటించే చిత్రాలలో ఆడవారిని ఏ రకంగా చిత్రీకరిస్తున్నారు అనేది మీకు తెలియదా?
అయ్యా…నిర్మాతలూ, హీరోయిన్ అనగానే బొడ్డు, నడుము, పిరుదులు, ఎత్తులు చూపించి ప్రేక్షకులను రెచ్చగొట్టనిదే మీ సినిమాకి collections రావని నమ్మే మీరు, మీ చిత్రాల ద్వారా సగటు ప్రేక్షకుడిని లేనిపోని కామోద్రేకానికి, అసంబద్ధమైన అనుభూతులకు గురి చేసి అతని ఆలోచనలను వికృతంగా మళ్లించడానికి పురిగొల్పి ఇప్పుడు అదే ప్రేక్షకుడు మీ వలన నిందితునిగా మారితే వారి encounter ను సమర్ధించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోండి?
అయ్యా, హీరోలు… 50 సంవత్సరాలు మీద పడినాగానీ యవ్వనాలను జుర్రుకోవాలని మీరు తీసే ఏ సందేశాత్మక చిత్రం అయినా, సామాజిక చిత్రంలో అయినా కనీసం ఒక item song ద్వారా అయినా మీ కళా రసికతని సంతృప్తి పరుచుకునే మీరు నిందితుల encounter ను సమర్ధించడం ఏ రకంగా న్యాయం?
అమ్మా, మహా నటీమణులు. సినిమాలలో అవకాశాల కోసం నటనకన్నా glammer performance ముఖ్యమని తెరమీద అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చి ప్రేక్షకుల మతులు చెడగొట్టి కనపడిన ప్రతీ ఆడదాని శరీరాన్ని మీ మేకప్ అందాలతో పోల్చుకుని మోసపోయి ఎదుటివారిలో తల్లిని, చెల్లిని చూసుకోవడం మర్చిపోయి మిమ్మల్ని చూసుకునే సంస్కృతికి నాందీ పలికిన మీరు ఈ encounter ను ఏ రకంగా సమర్ధిస్తారు?
అయ్యా దర్శకేంద్రులు… పండ్లు, కాయలు, రంగురంగుల వస్త్రాలు, చాలీ చాలని కురచ బట్టలతో హీరోయిన్ శరీరాన్ని ఒక ప్రయోగ కేంద్రంగా మార్చి ఒక ప్రేక్షకుడిని censor కి అందకుండా ఎంత కైపు వరకు తీసుకెళ్లగలమా అని దర్శక పాండిత్యానికి పదును పెట్టే మీరు ఈ encounter ను సమర్ధించడం ఏ రకంగా సబబు?
ఒక సామాజిక అరాచకం జరిగినప్పుడు దానిని ఖండించడం అందరి బాధ్యత, కానీ వాటిని ఖండించేముందు ఆ అరాచకానికి మనం ఎంతవరకు కారకులము అనేది కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ రోజు సమాజంలో దిశ లాంటి సంఘటనలు జరగడానికి వికృతమవుతున్న సినిమా రంగం కూడా ఒక కారణం. కాదని మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా?
జరిగిన సంఘటనను మీరు ఖండించడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు, ఇంకా చాలా రకాలుగా అనిపిస్తుంది…!