హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, అదే నెల 30వ తేదీన పోలింగ్, నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ స్థానానికి ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల షెడ్యూల్ కు ముందే ఇక్కడ ఎన్నికల వాతావరణం నెలకొంది. గత కొన్ని నెలలుగా వివిధ రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నాయి.
తమ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస యాదవ్ ను టీఆర్ఎస్ ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో హుజూరాబాద్ లో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది.