ప్రభుత్వ అధికారి అయిన తన భార్య అవినీతి బాగోతమంటూ ఓ భర్త విడుదల చేసిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అవినీతికి పాల్పడవద్దని తాను ఎంతగా నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఆ భర్త వాపోయాడు. హైదరాబాద్ మహానగరంలోని మణికొండ మున్సిపాలిటీలో దివ్యజ్యోతి డీఈఈగా పని చేస్తున్నారు. అయితే తన భార్య దివ్యజ్యోతి భారీగా లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడిందని భర్త శ్రీపాద ఆరోపించారు. భార్య అవినీతికి ఆధారాలంటూ పలు వీడియోలను విడుదల చేశాడు. దివ్యజ్యోతి పలువురు కాంట్రాక్టర్ల నుంచి వివిధ మొత్తాలను లంచంగా స్వీకరించినట్లు చెప్పాడు.
అవినీతి సొమ్ముగా పేర్కొంటూ తన భార్య ఇంట్లో లేని సమయంలో శ్రీపాద వీడియోలు తీయడం గమనార్హం. తమ ఇంట్లో ఎక్కడెక్కడ డబ్బు, బంగారం ఉందో చూపిస్తూ ఈ వీడియోలు తీశాడు. ఆతర్వాత తాను తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవినీతి పద్ధతులను మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా తన భార్య చెవికెక్కలేదని, ఏమాత్రం వినిపించుకోలేదని శ్రీపాద ఇదే వీడియోల్లో చెప్పాడు. బాధాకరమైనప్పటికీ తాను ఈ చర్యకు ఎందుకు పాల్పడుతున్నదీ వివరించాడు.
కాగా శ్రీపాద విడుదల చేసిన వీడియోలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దివ్యజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయాలని కొందరు డిమాండ్ చేస్తుండగా, శ్రీపాద అలైన భారతీయుడంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో దివ్యజ్యోతిని రెండు రోజుల క్రితమే ప్రభుత్వం జీహెచ్ఎంసీకి బదిలీ చేసినట్లు సమాచారం. శ్రీపాద విడుదల చేసిన వీడియోలను దిగువన చూడవచ్చు.