ఏవండీ…? ఏ గుడి వద్దో, గోపురం వద్దో, మరేదైనా ఫంక్షన్ హాల్ వద్దో, ఎక్కడో ఓ చోట మన చెప్పులను ఎవడైనా తస్కరిస్తే కాసేపు బాధపడతాం. కానీ ఆ తర్వాత పక్కవారు చెప్పే నానుడిని విన్నాక ‘హమ్మయ్య ‘శని’ పోయింది’ అని సంతోషపడతాం కదా? చెప్పులు పోతే శనిపోయినట్లేననే వాదన విన్నాక నిజమే కాబోలునని చెప్పులు పోయిన బాధ నుంచి స్థిమితపడతాం కదా? కానీ అవే పాత చెప్పులను కొనండహో…అని ఎవరైనా వెంట పడితే ఎలా ఉంటుంది? అసలు పాత చెప్పులు అమ్మినవారు, కొన్నవారు మనకు కనిపిస్తుంటారా? కానీ ఇతనెవరో olxలో తన పాత చెప్పులు కొనాలని నెటిజన్ల వెంట పడుతున్నాడు. తనకు డబ్బు అత్యవసరమనే కారణాన్ని కూడా చెబుతూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన ఒకరు తన పాత చెప్పులను olxలో అమ్మకానికి పెట్టాడు.
olxలో తమ పాత వస్తువులను అనేక మంది అమ్మకానికి పెట్టడం సహజమే. కానీ ఓ కారో, ఇల్లో, ప్లాటో, ఫ్లాటో, వాషింగ్ మిషనో, ఫ్రిజ్జో, మహా అయితే మొబైల్ ఫోన్ తదితర వస్తువులను అమ్మకానికి పెడతారు. చూసేవాళ్లు చూస్తారు, కొనేవాళ్లు కొంటారు. కానీ పాత చెప్పులను కొనేవారు ఎవరు? అనేదే అసలు ప్రశ్న. ఇంతకీ ఈ హన్మకొండవాసి నిజంగానే డబ్బు అవసరమై తన పాత చెప్పులను olxలో అమ్మకానికి పెట్టాడా? లేక వెటకారంగా ఈ సైట్లో అప్ లోడ్ చేశాడా? ఏమో మరి మీరే ఆలోచించండి!