రాజకీయ నాయకులన్నాక ఆస్తుల విషయంలో కూసింత స్పష్టత ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పకపోయినా, ఎన్ని ఉన్నాయో చెప్పాలి కదా? కనీసం ఎన్నికల అఫిడవిట్లోనైనా పెరిగిన తమ ఆస్తులను నయాపైసా దాచుకోకుండా చెప్పాలి మరి. కావాలంటే కర్నాటకలోని ఓ తాజా మాజీ ఎమ్మెల్యేను చూడండి…ఏడాదిన్నర కాలంలో అపారంగా పెరిగిన తన రూ. 185 కోట్ల ఆస్తులను నయాపైసా దాచుకోకుండా పూసగుచ్చినట్లు ఎన్నికల అఫిడవిట్లో ఎంత కూలంకషంగా వివరించారో.
కర్నాటకలో హోస్ కోట ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంటీబీ నాగరాజు అనే నాయకుడు ఉన్నాడు తెలుసు కదా? ఆ…ఆయనే…కర్నాటకలో కుమారస్వామి సర్కార్ కూలిపోవడానికి కారణమైన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు. వీరిపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు కూడా వేశారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అనర్హత వేటు పడిన ఆయా ఎమ్మెల్యేలు ప్రస్తుతం పోటీకి అర్హులే. తాజాగా బీజేపీలో చేరి ఉప ఎన్నికల రంగంలోకి దూకుతున్నారు. అందులో ఎంటీబీ నాగరాజు కూడా ఒకరు. హౌస్ కోట నుంచి పోటీ చేస్తున్న నాగరాజు తన ఆస్తుల నామినేషన్లో వెల్లడించిన ఆస్తులు ఏడాదిన్నర కాలంలోనే అమాంతంగా పెరిగిన తీరుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఎందుకంటే…నాగరాజు తన నామినేషన్లో పొందుపర్చిన ఆస్తుల వివరాలను చూసి ఎన్నికల ప్రధానాధికారి కూడా ఆశ్యర్యానికి గురయ్యారు మరి. గడచిన 18 నెలల్లో తన ఆస్తులు ఏకంగా రూ.185 కోట్లు పెరిగినట్లు నాగరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం నాగరాజు, ఆయన భార్య శాంతకుమారి పేర్ల మీద ఉన్న ఆస్తుల మొత్తం విలువ రూ.1,201కోట్లు. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన ఆస్తుల విలువ రూ.1,015 కోట్లు. ఈ ఏడాది ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం…చరాస్తుల విలువ రూ.419.28 కోట్లు. ఆయన భార్య చరాస్తుల విలువ రూ.167.34 కోట్లు. గత 18నెలల్లో ఆయన చరాస్తుల విలువ రూ.104.53 కోట్లు పెరిగింది. అందే విధంగా ఆయన భార్య ఆస్తి విలువ రూ.44.95 కోట్లు పెరిగింది. ఆగస్టులో కేవలం ఆరు రోజుల వ్యవధిలో ఆయన ఆస్తుల విలువ రూ. 25.84 శాతం పెరిగినట్లు ప్రకటించారు. ఆగస్టు 2 నుంచి 7 వరకు ఆయన బ్యాంకు ఖాతాలో 53 సార్లు నగదు డిపాజిట్ చేశారు. ఒక్కోసారి రూ.90 లక్షల కంటే ఎక్కువ నగదును మొత్తం రూ.48.76 కోట్లు డిపాజిట్ చేయడం విశేషం. జులైలో రూ.1.16 కోట్లు ఖాతాలో డిపాజిట్ అయ్యాయి. తన పేరుతో 57 ఎకరాలు, భార్య పేరుతో నాలుగు ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలిపారు.అదేవిధంగా తన పేరుతో రూ.2.23 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని అఫిడ్‌విట్‌లో వెల్లడించారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం జులై 23న కూలిపోగా, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. జులై 26న యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఆగస్టులో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసి నాగరాజు వార్తల్లోకి వచ్చారు. రూ.11 కోట్లతో రోల్స్ రాయిస్ ఫాంటమ్-8ను కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణమై, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు చెందిన 17 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 5న ఉప ఎన్నికలు జరగనున్నాయి.