చదివారుగా ప్రకటనలు. HIV పాజిటివ్ రోగులు కొందరు జంట కోసం గాలిస్తున్నారు. వివాహ యత్నాలు ప్రారంభించారు. అందుకు సంబంధించినవే ఈ ప్రకటనలు. ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో గత ఆదివారం ‘మ్యాట్రిమోని’ పేజీలో ప్రచురితమైన ప్రకటనల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇందులో తప్పు పట్టాల్సింలేమీ లేదు. HIV బారినపడినవారు ఎప్పుడు తనువు చాలిస్తారో తెలియని స్థితిలోనూ జంట కోసం ఆరా తీయడం సహజంగానే చర్చకు దారి తీసింది. HIV పేషెంట్లు తోడు కోసం తహతహలాడడం కూడా కొత్తేమీ కాదు. ఈ రోగం బారిన పడ్డ అనేక మంది జంటలుగా మారిన ఉదంతాలు ఉండనే ఉన్నాయి.
వాస్తవానికి HIV వచ్చిందంటే సమాజం వేలివేసి చూసే ఈ రోజుల్లో తమ భాగస్వామి కోసం వెతికే సమయంలో తమ పరిస్థితిని అనేక మంది రోగులు వెల్లడించడం లేదనే వాదన కూడా ఉంది. ఈ పరిణామాం కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తితో HIV రోగి వివాహం చేసుకునేందుకు దారి తీస్తుందనే ఆందోళన కూడా ఉంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని HIV పాజిటివ్ ఉన్న వారికి అదే కమ్యూనిటీ నుంచి జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు ముందుకు రావడం గమనార్హం.
HIV ఇప్పటికీ అనేక దేశాలను వణికిస్తోంది. ఇప్పటిదాకా 3.5 కోట్ల మందికి పైగా ప్రాణాలను ఎయిడ్స్ వ్యాధి బలితీసుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే ప్రకటంచింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం HIVతో జీవిస్తున్నవారిలో 70శాతం ఆఫ్రికాలోనే ఉన్నారు. HIV సోకిన వారిలోనే ఎయిడ్స్ ఉందని గుర్తించడానికి సాధ్యపడుతుందని, ఆ వైరస్ లేకపోతే ఎయిడ్స్‌ను గుర్తించడం వీలుకాదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. దాదాపు నాలుగు దశాబ్ధాల క్రితం అంటే… 1980ల్లో ఎయిడ్స్ వ్యాధి ప్రబలినప్పటి నుంచీ దాని చుట్టూ ఎన్నో అపోహలు, అనుమానాలు, భయాలు అలుముకోగా, ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి.