ఒక్కోసారి కొన్ని సినిమాల్లో హీరోలకన్నా, అనామక పాత్రలకే పేరు ప్రఖ్యాతులు విపరీతంగా వస్తుంటాయి. అది సినిమా. కథ, కథనం, పాత్రలు యావత్తూ కల్పితం. రచయిత, దర్శకుడు తమకు అనువైన రీతిలో ‘కథ’ను, సీన్లను మల్చుకుంటుంటారు. అది వాళ్ల ఇష్టం, స్వేచ్ఛ. కానీ… కొన్ని చరిత్రల్లోనూ అంతే. చరిత్రకారులకన్నా చరిత్రలో ఎక్కడా కనిపించని వారికే భారీ ప్రాచుర్యం లభిస్తుంటుంది. చరిత్రల్లోని త్యాగధనులకన్నా, పోరాట సన్నివేశాల్లో చివరి వరుసలో కూడా లేనివారికే ప్రతిసారీ ఎక్కువగా ప్రాచుర్యం లభిస్తే…? మనసు చివుక్కుమంటుంది కదా?
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన చరిత్రలో మలిదశ ఉద్యమానికి జెండా ఎత్తి ‘జైబోలో తెలంగాణా’ అంటూ నినదించిన కేసీఆర్ ప్రాధాన్యతను ఎవరూ కాదనలేరు. ఆయనకు మరెవరూ ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరమూ లేకపోవచ్చు. తెలంగాణా చరిత్ర ఉన్నంతవరకు కేసీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. అందులో డౌటేమీ లేదు. కానీ ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని, నిలువునా దహించుకుని, ఆత్మార్పణం చేసిన శ్రీకాంతాచారి వంటి ఎందరో విద్యార్థులకన్నా, సైద్ధాంతికంగా తెలంగాణా ఉద్యమానికి రూపునిచ్చి, ఊతమిచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ కన్నా, అలుపెరుగని ప్రత్యేక పోరులో కాలికి గజ్జె కట్టి ఆడి, పాడి అలసిన గద్దర్ వంటి ప్రజా గాయకులకన్నా, తెలంగాణా బిడ్డల బలిదానాన్ని చూసి చలించి పార్టీ ప్రయోజనాన్ని ఫణంగా పెట్టిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకన్నా, ఈ ‘చిన్నమ్మ’ను గుర్తుంచుకోండి… అంటూ ప్రత్యేక తెలంగాణా బిల్లుకు పార్లమెంటులో మద్ధతు పలికిన సుష్మా స్వరాజ్ కన్నా, మిలియన్ మార్చ్ ద్వారా పోరాట పటిమ శక్తి ఏమిటో ప్రపంచానికి చాటిన ప్రొఫెసర్ కోదండరాంకన్నా, ఏ పోరాటంలోనూ ‘అడుగు’కూడా వేయని కొందరు నేతలను ప్రతిసారీ తల్చుకుంటుండడం విశేషం కాక మరేమిటి? ఓ రకంగా ఇది చారిత్రక విషాదం కూడా. ఏంటీ ఉపోద్ఘాతం అంటే…?
దిగువన గల సోషల్ మీడియా పోస్టును ఓసారి జాగ్రత్తగా చదవండి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో ఆవిర్భావ దినోత్సవం నుంచి అనేక కార్యక్రమాల్లో ఈ పోస్టులో గల నాయకులను ప్రజలు ఏమాత్రం మర్చిపోకుండా నెటిజన్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర పోరులో ఈ నేతల పోరాట పటిమను, చేసిన త్యాగాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఈ నేతల పేర్లను వరుస క్రమంలో ఎగువకు, దిగువకు మారుస్తూ, అవసరార్థం కొందరి పేర్లను తొలగిస్తూ, ప్రయోజనార్థం మరికొందరు పేర్లను కలుపుతూ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనలో అసువులుబాసిన అనేక మంది నాయకుల, విద్యార్థుల పేర్లు ఈ పోస్టుల సృష్టికర్తలకు ఏమాత్రం గుర్తుండకపోవచ్చు. వారి పేర్లను స్మరించాలనే సోయి కలగకపోవచ్చు. కానీ ఈ పోస్టులోని నాయకుల పేర్లను మాత్రం జనం నోళ్లలో నిత్యం నానే విధంగా నెటిజన్లు పాటుపడుతుండడం గమనార్హం. ఈ పోస్టును షేర్ చేసేవారి భావం ఏదైనప్పటికీ, పదే పదే ఈ నేతలను గుర్తు చేస్తూ వారికి ప్రాచుర్యం కల్పించడం ఆశ్చర్యం కాక మరేమిటి? అందుకే కాబోలు ఎప్పుడైనా, ఎక్కడైనా చరిత్రకారులకు లేని ప్రాచుర్యం చరిత్రలో లేనివారికే ఎక్కువగా లభిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎప్పటిలాగే మరోసారి వార్తల్లోకి వచ్చిన ఈ సోషల్ మీడియా పోస్టును జాగ్రత్తగా చదవండి. తెలంగాణా పోరాటంలో సర్వస్వం త్యాగం చేసిన మరి కొందరు మంత్రులు, ముఖ్య నేతల పేర్లు ఇందులో లేవు కదా? అని ప్రశ్నించకండి. శ్రీ… అంటూ చివరలో ఖాళీగా ఉన్నచోట మీకు నచ్చిన నేత పేరును రాసుకోవచ్చని కూడా ఈ సోషల్ మీడియా పోస్టు ‘షేర్’దార్లు సెలవిస్తున్నారు. అదీ సంగతి. ఇక ఈ పోస్టు చదవండి.
అన్నం తిన్నరో…అటుకులు బుక్కిండ్రో…
జైలుకు వొయిండ్రో…కేసులు మోశిండ్రో…
తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఉద్యమకార్లు…
శ్రీ తలసాని శ్రీనివాస్ గారికి…
శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారికి…
శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి…
శ్రీ అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారికి…
శ్రీ గంగుల కమలాకర్ గారికి…
శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి…
శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి…
శ్రీ దానం నాగేందర్ గారికి…
శ్రీ నామా నాగేశ్వరరావు గారికి…
శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి…
శ్రీ రంజిత్ రెడ్డి గారికి…
శ్రీ వెంకటేశ్ గారికి…
శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారికి…
శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి గారికి…
శ్రీ తలసాని సాయి గారికి…
శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి..
శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారికి…
శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారికి…
శ్రీ…
శ్రీ….
గార్లకు ఉద్యమమే లేదు. ఉర్కిచ్చికొడ్తం. డ్రామాలు, హైదరాబాద్ లో ఎట్ల తిరుగుతవో సూస్త బిడ్డా… అని బెదిరించిన మూడున్నర కోట్ల ఉద్యమ ద్రోహుల తరపున
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ?