గురువారం కోర్టుకు హాజరు కండి’… తెలంగాణా రాష్ట్రంలో డెంగీ జ్వరాల తీవ్రతపై చీఫ్ సెక్రటరీకి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి, డైరెక్టర్ కు  హైకోర్టు ఇచ్చిన  ఆదేశం ఇది. తెలంగాణాలో డెంగీ జ్వరాల తీవ్రతపై హైకోర్టు స్పందించిన తీరుపై రాష్ట్ర ప్రజానీకంలో హర్షం వ్యక్తమవుతోంది. వాస్తవానికి డెంగీ జ్వరాల తీవ్రత గత కొద్ది నెలలుగా పెరిగింది. ప్రజల నుంచి విమర్శల జడివాన మొదలయ్యాక ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పలు జిల్లాలు పర్యటించి అన్ని జ్వరాలు డెంగీ కాదని భరోసా కల్పించే యత్నం చేశారు. కానీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డెంగీ జ్వరాల తీవ్రత పెరుగుతూనే ఉంది. ఖమ్మం జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే…నిరుటికన్నా ఈ ఏడాది రెండు రెట్లు జ్వరాల తీవ్రత పెరిగింది. గత ఏడాది జిల్లాలో 722 డెంగీ కేసులు నమోదు కాగా, ఈసారి ఆ సంఖ్య 2,137కు పెరిగినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. డెంగీ జ్వరాలతోపాటు విష జ్వరాల తీవ్రత కూడా భయపెడుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 80 వేల మంది విష జ్వరాల బారిన పడినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రయివేట్ ఆసుపత్రుల్లో నమోదవుతున్న విషజ్వరాల సంఖ్య ఏడు లక్షల వరకు ఉందని సమాచారం. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో గడచిన రెండున్నర నెలల్లో రెండు లక్షల మంది వైద్య సేవలు పొందిన గణాంక వివరాలు తీవ్ర ఆందోళనకర పరిణామంగా వైద్య వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ ప్రాతిపదికన రాష్ట్ర వాప్తంగా జ్వరాల తీవ్రతను అవగతం చేసుకోవచ్చని ఆ వర్గాలు అంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే తెలంగాణాలో డెంగీ జ్వరాలపై రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకోవలసిన పరిస్థితులు అనివార్యం కావడం గమనార్హం. డెంగీ జ్వరాల తీవ్రతపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డెంగీ జ్వరాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై, ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదని కూడా హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం స్పందించడంలేదని హైకోర్టు పేర్కొన్న తీరు సర్వత్రా చర్చకు దారి తీసింది. ఆర్టీసీ సమ్మె విషయంలో, డెంగీ జ్వరాల అంశంలో హైకోర్టు ఆదేశిస్తే తప్ప పనులు జరిగేట్లు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కేసీఆర్ సార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Comments are closed.

Exit mobile version