దృశ్యం 1:
————
1980వ దశకం… ఓ మంత్రి తమ
పార్టీకి చెందిన సన్నిహితుని ఇంట్లో కూర్చుని జిల్లా కలెక్టర్ ను తన
వద్దకు రావాలని తన పీ ఏ తో ఫోన్ చేయించారు. అధికార పార్టీ నేతకు
చెందిన ఆ ఇంట్లో మంత్రిని కలవడానికి ఆ ఐఎఎస్ అధికారి
నిరాకరించారు. అధికారిక పని అయితే కలెక్టరేట్ కు వస్తే మాట్లాడుతానని, తేనీరు ఇచ్చి మర్యాద కూడా చేస్తానని ఆ
కలెక్టర్ మర్యాదగానే
చెప్పారు. చేసేదేమీ లేక…ఈ కలెక్టర్ కు అహంకారం అంటూ మంత్రి తనకు ఎదురైన
చేదు అనుభవాన్ని మళ్లీ ఎక్కడా చెప్పుకోలేదు కూడా. కానీ కొద్ది నెలలకే
ఆ కలెక్టర్ బదిలీ అయ్యారు…అది వేరే విషయం. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ
సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది.
దృశ్యం 2:
————
ఇది మరో దశకం. ఓ
మంత్రి కారు ఆగగానే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ రెండువైపులా నిలబడి చెరోవైపు కారు
డోర్లు తీశారు. చిద్విలాసంగా నవ్వుతూ మంత్రి కారులో నుంచి దిగారు. ఇందుకు
ప్రతిఫలంగా ఆ ఇద్దరు
అధికారులు సుదీర్ఘ కాలం పాటు అదే జిల్లాలో కొనసాగారు. ఇది ఉత్తరం, దక్షిణం కాని తెలంగాణలోని మరో జిల్లాలో
జరిగిన ఉదంతం.
దృశ్యం 3:
———–
గణతంత్ర దినోత్సవ
వేడుకల్లో ఈ ఖిల్లాపై తొలిసారి జెండా ఎగురవేసే అవకాశం కల్పించినందుకు
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేస్తున్నాను అంటారు ఓ
ఐఏఎస్ అధికారి. అదే కార్యక్రమంలో మరో ఐఏఎస్ అధికారి అప్పటి నిజామాబాద్ ఎంపీ,
కేసీఆర్ కూతురు
కల్వకుంట్ల కవిత కాళ్ళ వద్ద కూర్చుని ఏదో ముచ్చటిస్తుంటారు. 2017 గణతంత్ర వేడుకల సందర్భంగా జగిత్యాల
జిల్లా కేంద్రంలో జరిగిన ఈ రెండు ఘటనలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
ఇదంతా ఎందుకు
చెప్పుకోవలసి వస్తున్నదంటే…ప్రజలకు సేవలు అందించాల్సిన ఐఎఎస్
అధికారుల్లో వస్తున్న
దశలవారీ మార్పులను సృషించడం కోసం. తెలంగాణలో డెంగీ జ్వరాల తీవ్రతపై రాష్ట్ర హైకోర్టు
గురువారం తీవ్రంగా మండిపడిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల పనితీరు మరోసారి
ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సర్వీస్ లో గల ఐఏఎస్ అధికారులందరూ పాలక వర్గాలకు
భజన చేస్తున్నారన్నారన్నది ఈ వార్తా కథనం ఉద్దేశం కాదు. కానీ కొందరు
ఐఏఎస్ అధికారులు తమ విద్యుక్త ధర్మాన్ని విడనాడి ప్రవర్తిస్తున్న
ఫలితంగా ప్రజలు అగచాట్లు పడుతున్నారన్నది నిర్వివాదాంశం. పాలకుల
మెప్పు పొందడానికి వారు పడుతున్న ప్రయాస పలు సందర్భాల్లో వివాదం అవుతోనే
ఉంది.
తెలంగాణలో స్వైరవిహారం చేస్తున్న డెంగీ జ్వరాల తీవ్రతపై హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గురువారం తమ ముందు హాజరై డెంగీ జ్వరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటో చెప్పాలని సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించింది. ఈ మేరకు గురువారం హాజరైన అధికారులను, ముఖ్యంగా ఐఎఎస్ అధికారులను హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. ‘ మీరు దేశ పౌరులు కాదని అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించింది. ఐఏఎస్‌లుగా తీర్చిదిద్దడానికి రూ. కోట్లు ఖర్చు చేస్తున్నది ఈ తరహా పనికేనా? అని నిలదీసింది. సామాన్యులకు సమస్యలు వస్తే న్యాయస్థానం చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది. డెంగీ జ్వరాలకు సంబంధించి ఇకనుంచి సుమోటోగా కేసులు స్వీకరించాల్సి వస్తుందని కూడా పేర్కొంది. ఐఏఎస్‌లు కనీసం పత్రికలు కూడా చదువుతున్నట్టు లేదని వ్యాఖ్యానించింది. పత్రికల్లో ప్రతి పేజీలోనూ ప్రజా సమస్యలపై వార్తలు వస్తున్నాయని, నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారుల జేబుల నుంచి బాధితులకు రూ. 5.00 లక్షల వరకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. డెంగీ నివారణకు చర్యలు తీసుకోవాలని ఎనిమిది నెలలుగా పదే పదే కోరినా అధికారుల్లో చలనం లేదని అని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. డెంగీ వల్ల మృతి చెందిన సంఘటనల్లో బాధిత కుటుంబాలకు రూ. 50.00 లక్షల వరకు పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుందని పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గురువారం విచారణ సందర్భంగా హాజరైన ఐఎఎస్ అధికారులు డెంగీ నివారణకు తీసుకున్న చర్యలపై ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. హైకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలోనైనా ఐఏఎస్ అధికారుల తీరులో మార్పు వస్తుందని ఆశిద్దామా మరి?