తెలంగాణా సచివాలయ పాత భవనాల కూల్చివేతకు ముంబయి నుంచి అధికారులు భారీ యంత్రాన్ని తెప్పించారు. సచివాలయం పాత భవనాల కూల్చివేత పనులను ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఏ, బీ, సీ, డీ, హెచ్ నార్త్, హెచ్ సౌత్, కే బ్లాకులను పూర్తిగా నేలమట్టం చేశారు. జే, ఎల్ బ్లాక్లను సైతం స్వల్ప స్థాయిలో, పాక్షికంగా కూల్చివేశారు.
కూల్చివేత ప్రక్రియలో జే, ఎల్ బ్లాకులు అత్యంత ఎత్తుగా ఉండడంతో టాటా హిటాచి కంపెనీకి చెందిన జైజాంటిక్ అనే పేరుగల భారీ యంత్రాన్నిరోడ్లు, భవనాల శాఖ అధికారులు ముంబయి నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. దీంతో రేపు సాయంత్రం కల్లా కూల్చివేత పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
కాగా సమీకృత కొత్త సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగానే పాత సచివాలయం భవనాల కూల్చివేతల పురోగతిపై, కొత్త సచివాలయ నిర్మాణంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఈ మధ్యాహ్నం నుంచి సమీక్షిస్తున్నారు.