పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఫలితంగా కురిసన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పంటలకు భారీ నష్టం వాటిల్లంది. ఇల్లెందు, కోయగూడెం, సత్తుపల్లి కిష్టారం ఓపెన్ కాస్ట్ బొగ్గుగనుల్లో ఉత్పత్తి పనులు స్తంభించాయి. అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. తల్లాడ మండలం మిట్టపల్లి వాగు వంతెనను ఆనుకుని ప్రవహిస్తోంది. దాని చుట్టుపక్కల వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇప్పటికే ఉల్లికోడు చీడ సోకిన వరిపంటలకు ఈ వర్షాలు మరింత నష్టాన్ని కలిగించే అవకాశాలున్నట్లు రైతులు చెబుతున్నారు. పామాయిల్, మామిడి తోటలు సైతం తుఫాను వర్షపు నీటిలో మునిగాయి. వరదనీరు రెండు రోజులకు మించి నిలిచి ఉంటే పంటలను పెద్ద ఎత్తున నష్టపోవలసి వస్తుందని రైతాంగం ఆందోళన చెందుతోంది.
ఇదిలా ఉండగా పెనుబల్లి వద్ద గల రాతోని చెరువు మత్తడిని దాటేందుకు ప్రయత్నించిన తండ్రీ, కొడుకులిద్దరు నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. మల్లెల రవి, జగదీష్ అనే వ్యక్తులు చెరువు మత్తడికి అవతలివైపున గల తమ పంట పొలాన్ని చూసేందుకు వెళ్లారు. తిరుగుపయనంలో ప్రవహిస్తున్న చెరువు మత్తడిని దాటబోయి ఇద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే కుమారుడు జగదీష్ చెట్టూ, చేమా పట్టుకుని ఎలాగోలా ప్రమాదం నుంచి బయటపడగా, ఆయన తండ్రి రవి మాత్రం గల్లంతయ్యాడు. అతని కోసం స్థానికులు గాలిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుఫాన్ కలిగించిన విలయ దృశ్యాలను దిగువన స్లైడ్ షో లో చూడవచ్చు.