చదువుకున్న ఓటర్లకూ రేటు కడుతున్నారు. ఇంతకీ తమ సంగతి ఏంటని ఏకంగా కొందరు గ్రాడ్యుయేట్లు కూడా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. తమ గుంపునకు గంపగుత్తగా రేటు కట్టాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. తమనెవరూ పట్టించుకోవడం లేదని మరికొందరు వాపోతున్నారు. శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘ఓటుకు నోటు’ పంపిణీ బాగోతంలోని సిత్రాలివి. ఔను… విద్యావంతుల ఓట్లకు కూడా అభ్యర్థులు ఖరీదు కడుతున్నారు. ఇందులో సందేహమే లేదు. ప్రాంతాలవారీగా, పరిస్థితులకు అనుగుణంగా డబ్బు పంపిణీ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు గల సమాచారం ప్రకారం ఒక్కో ఓటును రూ. 1,000 మొత్తానికి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు మాత్రమే కాదు, ఉద్యోగవర్గాలు సైతం ‘నోటు’ ఇవ్వనిదే ఓటు వేసే ప్రసక్తే లేదని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణాలో ఈనెల 14న ఎన్నికలు జరుగుతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో డబ్బు వరదలా పారుతోందనే ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు పదిన్నర లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చవి చూసిన చేదు ఫలితాల నేపథ్యంలో ఈ ఎన్నికలు అధికార పార్టీ ప్రతిష్టకు సవాల్ గా పరిశీలకులు భావిస్తున్నారు. గులాబీ పార్టీకి చెందిన 13 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు కాలికి రికాం లేకుండా ప్రచారం నిర్వహిస్దుండడమే ఇందుకు నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో 77 సెగ్మెంట్ల పరిధిలో, ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు స్థానాల్లో అధికార పార్టీ విజయం సాధించకుంటే రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు అనివార్యమనే వాదన కూడా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు విజయం సాధించేందుకు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహిస్తుండడం గమనార్హం. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో ఓటుకు వెయ్యి చొప్పున నగదు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి మొత్తం 3.00 లక్షల గ్రాడ్యుయేట్స్ ఓట్లను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పక్కా ప్రణాళికాబద్ధంగా నగదు పంపిణీ జరుగుతోందంటున్నారు. ఓటుకు వెయ్యి ప్రాతిపదికన 3.00 లక్షల ఓట్లను టార్గెట్ గా చేసి రూ. 30.00 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేస్తున్నట్లు ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులు లెక్కలు కడుతున్నారు. సోషల్ మీడియాలో ఇదే అంశపై పోస్టులు కూడా పెడుతున్నారు. అంతేగాక వివిధ రకాల మీడియాల్లో భారీ ఎత్తున డబ్బు గుమ్మరించి ఇచ్చిన ప్రకటనలు, మద్యం సరఫరా వంటి అంశాల్లో చేసిన ఖర్చును కూడా గణిస్తే ఆయా పార్టీ అభ్యర్థి ఖర్చు కనీసంగా రూ. 50.00 కోట్లు ఉండవచ్చంటున్నారు. ఈ మొత్తం ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. నగదు పంపిణీ ఎపిసోడ్ లో చదువుకున్న గ్రాడ్యుయేట్లు సైతం ‘మాకేంటి…?’ అనే పదాన్ని ఉచ్ఛరిస్తూ చేయి చాచడమే అత్యంత విషాదకరంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
కార్టూన్: కార్టూనిస్టు రమణ ఫేస్ బుక్ నుంచి కృతజ్ఞతలతో….