చాలా మంది కొమ్ములు తిరిగిన, తోపులమని తమకు తాము భావించే జర్నలిస్టులకు ఈ హెడ్డింగ్ నచ్చకపోవచ్చు. నచ్చినా, నచ్చకపోయినా పెద్ద ఇబ్బందేమీ లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న దృశ్యాన్ని నిశితంగా పరిశీలించండి. ఓ యువతి రైతుబంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాదాలవద్ద ప్రణమిల్లి తన కొంగుచాచి మరీ అర్థిస్తోంది. తనకు, తనలాంటివారికి న్యాయం చేయాలని రాజేశ్వర్ రెడ్డి ముందు మోకరిల్లింది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నిన్న వైరా నియోజకవర్గంలోని కారేపల్లి, ఏన్కూరు మండలాల సమావేశం జరిగింది. ఏన్కూరు కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో రాజేశ్వర్ రెడ్డి పాదాలచెంత ప్రణమిల్లి తనను ఆదుకోవాలని అభ్యర్థిస్తున్న ఈ యువతి పేరు వై. కృష్ణవేణి.
బోనకల్ మండల నివాసిగా తెలుస్తున్న కృష్ణవేణి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసేవారు. కొంత కాలం క్రితం ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఉపాధి లేకుండా పోయిందని, జీవితం దుర్భరంగా మారిందని ఈ యువతి రాజేశ్వర్ రెడ్డి పాదాల చెంత వాపోయారు. ప్రయివేట్ సంస్థల్లోని ఉద్యోగాలను సైతం తమ ఘనతగానే నిన్న తమ అధికార పత్రికలో వ్యాసరూపంలో ప్రకటించుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ యువతికి ఎటువంటి హామీ ఇచ్చారనే అంశంపై స్పష్టత లేదు.
కానీ మనసున్న ప్రతి గుండెను కలచివేసే ఈ ఫోటోను మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమాత్రం పట్టించుకోలేదు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలకు సంబంధించి భారీ కవరేజ్ ఇచ్చిన పత్రికలుగాని, టీవీలుగాని ఈ యువతి ఆవేదను వార్తగా పరిగణించినట్లు లేదు. అందుకే కాబోలు ఈ ఫొటో ప్రచురణకు నోచుకోలేదు, సరైన ప్రాచుర్యం లభించలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ ఫొటో గురువారం వైరల్ గా మారింది. ఇప్పుడు చెప్పండి ఫొటోను మరోసారి చూసి… జర్నలిజం ఇంకా బతికి ఉన్నట్లేనా!?