కల్వకుంట్ల కృష్ణ మిలన్ రావు…పేరు గుర్తుంది కదా? హైదరాబాద్ బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ వంతెనపై కారు పల్టీలు కొట్టిన ప్రమాద ఘటనలో నిందితుడు. గత నెల 23వ తేదీన బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ వంతెన పై నుంచి కృష్ణ మిలన్ రావు నడుపుతున్న కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ కిందనున్న రోడ్డుపై పడిన దృశ్యాలు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈ ప్రమాదంలో సత్యవతి (56) అనే మహిళ అక్కడిక్కడే దుర్మరణం చెందగా, కుబ్రా (23), బాలరాజ్ నాయక్, ప్రణీత అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారు నడుపుతున్న కృష్ణ మిలన్ రావు కూడా గాయపడి చికిత్స కోసం గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చేరిన సంగతీ తెలిసిందే. పదహారు రోజుల చికిత్స అనంతరం కృష్ణ మిలన్ రావు గత ఆదివారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. అయితే ఏంటి? అని ప్రశ్నించకండి. అసలు విషయం కూడా చదవండి.
రాయదుర్గం సీఐ రవీందర్ కథనం ప్రకారం… ప్రమాద ఘటనకు సంబంధించి నిందితుడు కృష్ణ మిలన్ రావుపై ఐపీసీ 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 3న ఐపీసీ 304 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) సెక్షన్‌గా కూడా మార్చారు. ఈ ఫ్లై ఓవర్ వంతెన పై 40 కిలో మీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాలని సూచిక బోర్డులు ఉన్నప్పటికీ, 105.8 కిలో మీటర్ల వేగంతో కృష్ణ మిలన్ రావు నడుపుతున్న కారు దూసుకు వెళ్లినందునే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ఆధారాలు కూడా సేకరించారు. అయితే, అసలు ఈ ప్రమాదం జరగడంలో తన తప్పేమీ లేదని కష్ణ మిలన్ రావు స్వయంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో వాదించారు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ‘ఎస్’ ఆకారంలో ఉందని, డిజైన్ లోపాల కారణంగానే ప్రమాదం జరిగిందని, తన తప్పిదం లేదని, తక్కువ వేగంతోనే కారు నడిపానని ఆయన పేర్కొన్నారు. బెయిల్ ఇవ్వాల్సిన కేసులో అరెస్ట్ చేస్తామని పోలీసులు వేధిస్తున్నారని, తనకు బెడ్ రెస్ట్ అవసరమని నిందితుడు కృష్ణ మిలన్ రావు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన హైకోర్టులో కృష్ణ మిలన్ రావు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, 12వ తేదీ వరకు అతన్ని అరెస్ట్ చేయవద్దని కోర్టు స్టే ఇచ్చినట్లు పోలీసులు కూడా ధృవీకరించారు. అదే రోజు తాము కౌంటర్ దాఖలు చేయనున్నట్లు కూడా రాయదుర్గం సీఐ వెల్లడించారు.