వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ క్యాంపు కార్యాలయ కూల్చివేత ఘటనపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కీలక ప్రకటనను వెలువరించింది. హన్మకొండ-వరంగల్ మార్గంలోని హంటర్ రోడ్డులో నాలాపై ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని బుధవారం GWMC అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి GWMC పీఆర్వో అధికారికంగా విడుదల చేసిన ఆయా ప్రకటనను ఉన్నది ఉన్నట్లుగానే దిగువన చదివేయండి.
అరూరి ఆదర్శం
నాలా విస్తరణకు కార్యాలయ భవనాన్ని తొలగింపునకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గ్రీన్ సిగ్నల్
స్ఫూర్తిగా నిలిచిన ఎమ్మెల్యే..
బల్దియా కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన హామీకు కట్టుబడి తొలగింపు ..
జిడబ్ల్యూఎంసి, 16 సెప్టెంబర్ 2020
హంటర్ రోడ్ లో నాలపై గల తన కార్యాలయ భవనాన్ని తొలగించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కోరిక మేరకు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులను బుధవారం అట్టి భావనాన్నీ తొలగించడం జరిగింది. తన భవనం వల్ల నాల విస్తరణకు ఆటంకం కలుగుతున్నదని ఎమ్మెల్యే దృష్టికి రాగా గతంలో జరిగిన బల్దియా కౌన్సిల్ సమావేశంలో ఆయన స్వచ్చందంగా తొలగిస్తానని హామీ ఇచ్చారు.
ఈ మేరకు ఎమ్మెల్యే ఈ రోజు తన క్యాంప్ కార్యాలయం భావనాన్ని తీసేసి నాలల స్థలాలపై అక్రమంగా నిర్మించి ఉన్న ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రజలకు ఆయన స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఈ నేపద్యంలో మంత్రి కేటీఆర్ నగరాన్ని సందర్శించారు. వరద ప్రభావానికి నగరంలో ఉన్న అక్రమనలే ప్రధాన కారణమని తేల్చారు. యుద్ధప్రాతిపదికన నాలల ఆక్రమణలను తొలగించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. నాలల ఆక్రమణలను తొలగిస్తూ విస్తరణ చర్యలను టాస్క్ ఫోర్స్ చేపట్టింది. ఇందుకు సహకరిస్తూ వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ నాలా విస్తరణలో భాగంగా తన క్యాంప్ కార్యాలయాన్ని తొలగించారు.
కాగా ఈ అంశంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రదర్శించిన ఆదర్శం, స్ఫూర్తి తరహాలోనే ఇటువంటి అనేక కట్టడాలతో సంబంధమున్నట్లు ప్రాచుర్యంలో గల మిగతా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా GWMC అధికారులకు సహకరించి, నాలాల ‘క్లియరెన్స్’ కు దోహదపడాలని వరంగల్ మహా నగర ప్రజలు కోరుకుంటుండడం విశేషం.