ఔను… రూ. 7.00 కోట్ల నకిలీ నోట్ల కేసులో నిందితుడైన షేక్ మదార్ కంటే ఘనుడు సుందర రామయ్య. కోర్టులో తన కేసులను తానే వాదించుకునేవాడు. సుందర రామయ్య వాదన ఫలితంగా అతనిపై నమోదైన కేసులు అనేకం వీగిపోయేవి. అప్పట్లో సుందర రామయ్య పేరు నకిలీ నోట్ల చెలామణిదారులకే కాదు…పోలీసులకూ మింగుడు పడేది కాదు.
సుందర రామయ్య గుంటూరు టౌన్ కు చెందిన వ్యక్తి. 1979-1991 మధ్య కాలంలో నకిలీ నోట్ల పేరుతో మోసపు కార్యకలాపాలు కొనసాగించేవాడు. బాగా చదువుకున్న వ్యక్తి. అప్పట్లో అతన్ని దొంగనోట్ల సుందరరామయ్య అనే వారు. దక్షిణ భారత దేశంలో ఇతని కార్యకలాపాలు ఉండేవి. మద్రాస్ ఎయిర్ పోర్టులో నిలువెత్తు సుందరరామయ్య కటవుట్ ను అక్కడ పోలీసులు ఏర్పాటు చేసి, తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలకు సూచించేవారంటే నకిలీ నోట్ల మోసపు చర్యల్లో అతని కార్యకలాపాలను అంచనా వేసుకోవచ్చు.
విచిత్రం ఏమిటంటే సుందర రామయ్య ఏనాడు దొంగనోట్లు గానీ, నకిలీ నోట్ల పంపిణీ గానీ చేయలేదు. దొంగ నోట్లు తనవద్ద ఉన్నాయని, అసలు నోట్లకు రెట్టింపు ఇస్తానని బడాబాబులను ఆకర్షించేవాడు. ముఖ్యంగా ఓ వర్గానికి చెందిన వ్యాపారులనే టార్గెట్ చేసేవాడు. ఫలానా ప్రదేశానికి ఇద్దరు మాత్రమే రావాలని, తాను డ్రైవర్ మాత్రమే ఉంటామని నకిలీ నోట్ల కోసం వచ్చేవారికి చెప్పేవాడు. వారిలో నమ్మకం కలిగించేవాడు. దొంగ నోట్లు రూ. లక్ష ఇస్తే 25 వేలు అసలు నోట్లు ఇవ్వాలని బేరం కుదుర్చుకునేవాడు. నకిలీ నోట్ల కోసం వచ్చినవారిని తాను నిర్దేశించుకున్న ప్రదేశంలో కలిసేవాడు. ముందుగా వారి నుండి నగదు ఉన్న బ్యాగ్ తీసుకునేవాడు.తన వద్ద ఉన్న నకిలీ నోట్ల బ్యాగ్ ను అవతలి వారికి అందజేసే సమయంలో పోలీసు విజిల్ వినపడేది. దాదాపు పదిమంది పోలీసు దుస్తులతో నకిలీ నోట్ల కోసం వచ్చిన ఇద్దరి వెంట పడేవారు. బతుకు జీవుడా అంటూ వాళ్ళు పరుగులు తీసేవారు. సుందర రామయ్య మాత్రం సాదాసీదాగా నకిలీ నోట్ల కోసం వచ్చినవారి నుంచి ముందుగా తీసుకున్న బ్యాగ్ తో తన ఇంటికి చేరేవాడు. మరికొన్ని సందర్భాల్లో ఇతని బ్యాగ్ నకిలీ నోట్లు కోసం వచ్చిన వారికే ఇచ్చేవాడు. పోలీసుల విజిల్ తో రెండు పార్టీలు పలాయనం చిత్తగించేవి.
అయితే 1991లో ఆర్పీ మీనా అనే ఐపీఎస్ అధికారి గుంటూరు ఎస్పీ గా వచ్చిన తరువాత ,సుందర రామయ్య చేతిలో దగాపడ్డ రాజస్తాన్ వ్యాపారులు కొందరు ఎట్టకేలకు అతన్ని అరెస్టు చేయించారు. నిందితున్ని పోలీసులు కోర్టులో హాజరు పరిచేవారు. కానీ కేసులను వాదించడానికి సుందర రామయ్యకు లాయర్ ఉండేవారు కాదు. తానే వాదించుకునేవాడు. తనపై పోలీసు కేసు చదివిన తర్వాత “జడ్జిగారూ… నేనుదొంగ నోట్లు ఇవ్వలేదు. అతల వ్యక్తి అక్కడికి ఎందుకు వచ్చాడు? అతని ఉద్దేశం ఏమిటి? దొంగనోట్లు చలామణి చేయడానికి అతనికి నేనివ్వలేదే? కొత్త నోట్ల కట్ట అది. మొదటి కాగితం, ఆఖరి కాగితం రెండు మామూలు నోట్లు. మధ్యలో తెల్ల పేపర్లు ఉన్నాయి. నేను పెట్టలేదు. వాళ్ళే పెట్టి పోలీసులకు డబ్బులు ఇచ్చి నన్ను అరెస్టు చేయించారు. దొంగ నోట్లు ఇచ్చిన ఋజువు చూపమనండి జైలుకి వెళ్తా…అందుకు సిద్దంగా ఉన్నాను.” అని వాదించేవాడు. ” నేను నిజంగా దొంగ నోట్లు ఇస్తే… మీదాకా వచ్చేవి. మీరు కూడా మోసపోయేవారు కదా? సంఘంలో దొంగ నోట్లు చలామణి చేయాలని దురాశ ఉన్నవాళ్ళను జైలుకు పంపండి” అని సుందర రామయ్య వాదించేవాడు. సరైన సాక్ష్యం లేదని కోర్టు అతనిపై నమోదైన కేసును కొట్టి వేసేది. దాదాపు వంద కేసులకు పైగా సుందర రామయ్యపై నమోదు కాగా, వరుసగా కేసులన్నీ కోర్టులో వీగిపోయేవి. అయితే పోలీసులు అతనిపై ఇతర కేసులు పెట్టి జైలుకు పంపేవారు…అది వేరే విషయం. విషాదం ఏమిటంటే సుందర రామయ్య గుండెపోటుతో జైలులో బందీగానే మరణించాడు.