తుపాకులు మిస్ ఫైర్ కావడం కొత్తేమీ కాకపోవచ్చు. పోలీసుల తుపాకులైనా, నక్సలైట్ల ఆయుధాలైన పొరపాటున పేలిన దాఖలాలు అనేకం. ఆయుధాన్ని శుభ్రపరుస్తున్నప్పుడు, లేదా లాక్ చేయకుండా నిర్లక్ష్యంగా ధరించిన సందర్భాల్లో తుపాకులు మిస్ ‘ఫైర్’ అయిన ఘటనలు అనేకం. ఇటువంటి సందర్భాల్లో పలువురు గాయపడడం, ఇంకొందరు మృత్యువాత పడిన దుర్ఘటనలు ఉన్నాయి. కానీ నక్సలైట్ల వేటలో భాగంగా ‘కూంబింగ్’ ఆపరేషన్లకు వెళ్లిన సమయంలో తుపాకీ ‘మిస్ ఫైర్’ కావడం అరుదైన ఘటనగా చెబుతున్నారు.
అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో ఒక్కోసారి ‘క్రాస్ ఫైరింగ్’ జరిగిన సంఘటనలు కూడా గతంలో వెలుగు చూశాయి. అంటే పొరపాటున పోలీసులకు, పోలీసులకు మధ్యనే, నక్సలైట్లకు, నక్సలైట్లకు మధ్య కూడా కాల్పులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ కూంబింగ్ ఆపరేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ కావడం విషాదకర ఘటనగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సమీపంలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో నిన్న కూంబింగ్ నిర్వహిస్తుండగా రిజర్వుడు విభాగానికి చెందిన ఎస్ఐ ఆదిత్య దుర్మరణం చెందిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో ‘కూంబింగ్’ అపరేషన్లకు వెళ్లే పోలీసు బలగాలకు చెందిన తుపాకులు మిస్ ఫైర్ కావడం సహజంగానే చర్చకు దారి తీసింది. వాస్తవానికి నక్సలైట్ల గాలింపు చర్యలకు వెళ్లే పోలీసు బలగాలు గ్రేహౌండ్స్ శిక్షణను పొంది ఉంటాయి. అడవుల్లో సంచరించడం, అవసరమైన సందర్భాల్లో అడవుల్లోనే బస చేయడం కూంబింగ్ కు వెళ్లిన మెరికల్లాంటి గ్రేహౌండ్స్ భద్రతా బలగాలకు కొత్తేమీ కాదు. కూంబిగ్ ఆపరేషన్ కు వెళ్లిన పోలీసు బలగాలు తాము ఎంచుకున్న నిర్దేశిత ప్రదేశపు ప్రారంభ స్థలం (స్టార్టింగ్ పాయింట్) వద్దే ఏకే-47 వంటి అధునాతన ఆయుధాలను ‘ఛాంబర్ లోడ్’ చేస్తుంటారు. సాధారణంగా తుపాకుల్లో బుల్లెట్లను మ్యాగ్జిన్ లోడ్ మాత్రమే చేస్తుంటారు. కానీ కీలకమైన కూంబింగ్ ఆపరేషన్ల సందర్భంగా ‘ఛాంబర్ లోడ్’ అనే అంశం అత్యంత ప్రధాన్యాంశం.
ఎందుకంటే ఎంచుకున్న టార్గెట్ కనిపించినపుడు తుపాకీని ‘కాగ్’ చేయకుండా పేల్చడం ఛాంబర్ లోడ్ ప్రత్యేకత. అడవుల్లో గాలింపు చర్యలు నిర్వహిస్తున్న సమయంలో తమ లక్ష్యానికి సంబంధించిన వ్యక్తులు కనిపిస్తే, వాళ్లను కాల్చడానికి తుపాకీని ‘కాగ్’ చేస్తే శబ్ధం వస్తుంది. దీంతో అవతలి వ్యక్తి అప్రమత్తమవుతాడు. అందువల్లే కూంబింగ్ ఆపరేషన్లలో ఛాంబర్ లోడ్ అనివార్యం. దీనివల్ల బుల్లెట్ అప్పటికే ఛాంబర్ లో ఉంటుంది కాబట్టి, కాగ్ చేయకుండానే, శబ్ధం లేకుండానే నేరుగా టార్గెట్ ను కాల్చే అవకాశం ఉంటుంది. అందువల్లే ‘ఫీల్డు’లో ఛాంబర్ లోడ్ అవశ్యంగా పేర్కొంటుంటారు. ఇటువంటి సమయంలోనే తుపాకీ ఆటో ఫైర్, సేఫ్టీ ఫైర్ లేదా ర్యాపిడ్ ఫైర్ అనే అంశాల ప్రాతిపదికగా పని చేస్తుంటుంది.
అయితే చాంబర్ లోడ్ లో గల తుపాకీ బ్యారెల్ 360 డిగ్రీలు, లేదా భూమి వైపు ఉండేలా దాన్ని ధరించినవారు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. బటన్ 1, 2, 3 ఆప్షన్లలో ఉన్నప్పటికీ, చాంబర్ లోడ్ లో ఉన్నా, ట్రిగ్గర్ పై పొరపాటున చేయి పడినప్పటికీ బుల్లెట్ నేరుగా బయటకు వచ్చే అవకాశం ఉండదని కూడా చెబుతున్నారు. అయితే రోజుల తరబడి కూంబింగ్ ఆపరేషన్లకు వెళ్లే గ్రేహౌండ్స్ శిక్షణా బలగాలు ఎక్కువ సందర్భాల్లో అడవుల్లోనే నిద్రిస్తుంటాయి. ఈ సమయంలో టీమ్ లోని ఒకరు ‘గార్డ్’ డ్యూటీ చేస్తుండగా, మిగతా వారు నిద్రిస్తుంటారు. ఈ సమయంలోనూ తుపాకీ మిస్ ఫైరయ్యే అవకాశం ఉందంటున్నారు. నిద్రమత్తుల్లో గల గార్డ్ తుపాకీ పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటే.., ట్రిగ్గర్ పై పొరపాటున వేలు పడితే పేలే అవకాశాలు ఉంటాయంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు చోటు చేసుకునే మిస్ ఫైర్ దుర్ఘటనలు తుపాకీ వినియోగంలో ఒకింత నిర్లక్ష్యానికి కూడా కారణమనే వాదనలూ ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా పలు దుర్ఘటనల్లో ఎంతో భవిష్యత్తు గల ఎస్ఐ ఆదిత్య వంటి యువ అధికారుల, భద్రతా బలగాల మరణం ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత విషాదకరంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.