ఫొటోలో మీరు చూస్తున్న ఈ యువతి పేరు సునీతా యాదవ్. గుజరాత్ పోలీస్ శాఖలో ఓ సాధారణ కానిస్టేబుల్. ఇప్పుడు ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారనే వార్తలు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. ఇదే సమయంలో సునీతా యాదవ్ ను సోషల్ మీడియాలో నెటిజన్లు ‘సింగం’గా అభివర్ణిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో 2022లో జరిగే ఎన్నికల్లో సూరత్ జిల్లాలోని వరాచ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయాలని కూడా వారు అభిలషిస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళా కానిస్టేబుల్ గురించి ఒకటే చర్చ. ఇంతకీ విషయమేమిటంటే…?
గుజరాత్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సూరత్ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదే దశలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కుమార్ కనాని కుమారుడు ప్రకాష్ కనాని స్నేహితులు కారులో పచార్లు చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి కుమారుడి స్నేహితులను కానిస్టేబుల్ సునీతా యాదవ్ అడ్డుకున్నారు. కనీసం మాస్క్ ధరించకుండా రోడ్లపై ఈ చక్కర్లేమిటని ఆమె ప్రశ్నించారు. వాళ్లు మంత్రి కొడుకు ప్రకాష్ కనానీకి ఫోన్ చేశారు. సీన్ లోకి మంత్రిగారి సుపుత్రుడు అత్యంత వేగంగా మరో కారులో ఎంటరయ్యాడు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల్లో మంత్రి కుమారుడు ప్రకాష్ కనానిపై, అతని స్నేహితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.
అయితే అనంతర పరిణామాల్లో కానిస్టేబుల్ సునీతా యాదవ్ ఆకస్మిక బదిలీకి గురయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీతా యాదవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తాజా వార్తల సారాంశం. ఓ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం… ‘ఈ విషయంలో నా ఉన్నతాధికారుల నుంచి నాకు మద్ధతు లభించలేదు. కానిస్టేబుల్ గా నా డ్యూటీ నేను చేశాను. ఈ ప్రజలు కొందరిని (మంత్రి కుమారుడు ప్రకాస్ కనాని) వీవీఐపీలుగా భావించడం మన వ్యవస్థ తప్పు. అందుకే నేను రాజీనామా చేశాను’ అని సునీతా యాదవ్ పేర్కొన్నట్లు ఆంగ్ల పత్రిక కథనం ఉటంకించింది.
అయితే సునీతా యాదవ్ రాజీనామా అంశాన్ని గుజరాత్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ఖండించారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయలేదని, ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోందని, సాంకేతికంగా ప్రస్తుత సమయంలో సునీతా యాదవ్ రాజీనామా చేసే అవకాశమే లేదని సూరత్ పోలీస్ కమిషనర్ ఆర్భీ బ్రహ్మభట్ అన్నారు.
అయితే సునీతా యాదవ్ ను మాత్రం నెటిజన్లు లేడీ ‘సింగం’గా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆరోగ్య మంత్రి కుమార్ కనాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పోటీ చేయాల్సింగా కోరుతున్నారు.