కోదండరామ్… కోదండరామ్… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనంతరం మూడు ఉమ్మడి జిల్లాల్లో మార్మోగుతున్న పేరు ఇది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ముగిసిన పోలింగ్ సరళి అనంతరం పలు వర్గాల నుంచి వినిపిస్తున్న పేరు ప్రొఫెసర్ కోడండరామ్. టీజేఎస్ పార్టీ, ఆయనకు మద్ధతు ప్రకటించిన న్యూడెమోక్రసీ వంటి పార్టీల నేతల ధీమాను కాసేపు పక్కనబెడితే, ప్రభుత్వ నిఘా వర్గాలు సైతం కోదండరామ్ గెలుపు ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఎక్కువ ఉపోద్ఘాతంలోకి వెళ్లకుండా పోలింగ్ సరళి అనంతరం కోదండరామ్ గెలుపునకు బాటలు వేసినట్లు భావిస్తున్న కొన్ని ముఖ్యాంశాలను ప్రస్తావించుకుంటే…
కోదండరామ్ అనుకూల పార్టీలు, మద్ధతునిచ్చిన పార్టీలు తొలి ప్రాధాన్యత ఓటును ఆయనకే వేశాయి.
కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్ కు తొలి ప్రాధాన్యత ఓటు వేసిన గ్రాడ్యుయేట్లు రెండో ప్రాధాన్యత ఓట్లను కోదండరామ్ కు వేశారు.
టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి తొలి ప్రధాన్యత ఓటు వేసిన టీఆర్ఎస్ శ్రేణులు కూడా పలు చోట్ల రెండో ప్రాధాన్యత ఓటును కోదండరామ్ కే వేశాయి.
బీజేపీ అనుకూల గ్రాడ్యుయేట్లు సైతం రెండో ప్రాధాన్యత ఓటుకోసం కోదండరామ్ నే ఎంచుకున్నట్లు తెలుస్తుండడం విశేషం.
సీపీఐ అభ్యర్థి విజయసారథి రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేసిన వామపక్ష పార్టీల మద్దతుదారులైన పట్టభద్రులు కూడా కోదండరామ్ కే రెండో ప్రాధాన్యత ఓటు వేశాయి.
ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఆదివాసీ గ్రాడ్యుయేట్లు తొలి ప్రాధాన్యత ఓటుకోసం కోదండరామ్ ను ఎంచుకున్నారు.
ఇలా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన మద్ధతుదారులు, గ్రాడ్యుయేట్లు కోదండరామ్ కు రెండో ప్రాధాన్యత ఓటు వేయడం విశేషంగా చెబుతున్నారు.
ఇక నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో కోదండరామ్ వైపే గ్రాడ్యుయేట్లు తొలి ప్రాధాన్యతలోనే మొగ్గు చూపారనే వార్తలు వస్తున్నాయి.
ఇలా ఏ కోణంలో చూసినా తన అనుకూల వర్గాల నుంచి తొలి ప్రాధాన్యత ఓటును, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మద్ధతుదారుల నుంచి రెండో ప్రాధాన్యత ఓటును కోదండరామ్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామ్ వైపే మొగ్గు ఉందనే వార్తలు ధృవపడాలంటే ఓట్ల లెక్కింపు జరిగే 17వ తేదీ వరకు వేచి చూడక తప్పదు మరి.