తెలంగాణాలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడుతున్నాయి. తొలి ప్రాధాన్యతలో మొదటి రౌండ్ ఫలితాల్లో ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యతలో నిలిచారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో సురభి వాణీ దేవి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిలు లీడ్ లో ఉన్నారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానానికి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ రౌండ్ లో మొత్తం 56,003 ఓట్లను లెక్కించగా, అందులో 3,151 ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. మిగతా ఓట్లలో 16,130 ఓట్లను సాధించి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో 12,046 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, 9,080 ఓట్లతో టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్, 6,615 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, 4,354 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్, 1,123 ఓట్లతో రాణీ రుద్రమ, 1,077 ఓట్లతో చెరుకు సుధాకర్, 1,008 ఓట్లతో సీపీఐ అభ్యర్థి విజయసారథిరెడ్డిలు నిలిచారు.
ఈ స్థానంలో రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలు కూడా కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. రెండో రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 3,7,87 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి 15,857, తీన్మార్ మల్లన్న 12,070 , కోదండరామ్ 9,448, ప్రేమేందర్ రెడ్డి 6,669, రాములు నాయక్ 3,244 ఓట్ల చొప్పున సాధించారు.
మూడో రౌండ్ లో…
మూడో రౌండ్ ఫలితాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 15,558 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 11,742 ఓట్లు, కోదండరాంకు11,039 ఓట్లు, బీజేపీ ప్రేమేందర్ రెడ్డికి 5,320 ఓట్లు, కాంగ్రెస్ రాములు నాయక్ కు 4,333 ఓట్లు లభించగా, 3,092 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. మొత్తం మూడు రౌండ్లలో కలిపి పల్లా రాజేశ్వర్ రెడ్డి 47,545 ఓట్లు, తీన్మార్ మల్లన్న 35, 858 ఓట్లు, కోదండరాం 29, 567 ఓట్లను కైవసం చేసుకున్నారు. మొత్తంగా తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై పల్లా రాజేశ్వర్ రెడ్డి 11,687 ఓట్ల ఆధికత్యను కలిగి ఉన్నారు.
అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి 17,439, బీజేపీ అభ్యర్థి డాక్టర్ రామచందర్ రావు 16,385 , స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ 8,357, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 5,082 ఓట్లతో వరుస స్థానాల్లో నిలిచారు.
రెండో రౌండ్ లో…
రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు అనంతరం తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుపై టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి 2,613 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు రెండు రౌంగ్లలో కలిపి వాణీదేవికి 35,171 ఓట్లు, రాంచందర్ రావుకు 32,558 ఓట్లు లభించాయి.