కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్ డౌన్, సడలింపులకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాలపై ప్రత్యేక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఇందులో భాగంగానే రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. సాయంత్రం ఆరు గంటలనుంచి తిరిగి తెల్లారి ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది.

కరోనా పూర్తిగా అదుపులోకిరాని ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజకవర్గాల పరిధిలో మాత్రం లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యధాతథ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పదిహేను రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.

రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమీషన్, ప్రజా పంపిణీ వ్యవస్థలో గల సమస్యల పరిష్కార మార్గాల సూచనలకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. పాత తొమ్మిది జిల్లాల్లో తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టీఎస్ ఎఫ్.పి.జెడ్)  ఏర్పాటుకు కేబినెట్ అనుమతించింది. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 

Comments are closed.

Exit mobile version