సీఎం రేవంత్ రెడ్డి నోటా రైతులకు ‘బోనస్’ మాట వెలువడింది. రైతు భరోసాగా పేరు మార్చిన రైతు బంధు నిధుల విడుదల అంశంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందనే వ్యాఖ్యలు, విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం తాజాగా మళ్లీ బోనస్ మాట వల్లించడం గమనార్హం. ఈ అంశం రైతాంగంలో మరోసారి చర్చకు దారి తీసింది.
ఐదు రోజుల క్రితం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సన్నవడ్లకు బోనస్ ప్రయోజనంపై చేసిన వ్యాఖ్యలు రైతాంగంలో తీవ్ర ఆక్షేపణకు దారి తీసిన సంగతి తెలిసిందే. మహబూబ్ నగర్ లో నిర్వహించిన రైతు పండుగ ఉత్సవాల్లో భాగంగా గత నెల 29వ తేదీన తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, సన్నవడ్లకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ వల్ల సేద్యం చేసిన రైతుకు రూ. 15 వేల వరకు అదనంగా లభిస్తున్నాయని అన్నారు. ఓ రైతు ఈ విషయాన్ని చెబుతుండగా తాను విన్నానని, రైతులకు ఏది మంచిదో చెబితే దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తుమ్మల వ్యాఖ్యానించారు.
రైతు పండుగ వేదికపై మంత్రి తుమ్మల చేసిన ‘బోనస్’ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రైతు బంధును ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం వ్యవసాయ మంత్రిచేత ‘ఫీలర్’ను వదిలిందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే గత నెల 30వ తేదీన జరిగిన రైతు పండుగ ముగింపు ఉత్సవాల్లో ‘రైతు బంధు’ నిధులపై అటు సీఎం రేవంత్ రెడ్డిగాని, ఇటు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుగాని ప్రస్తావించలేదు. దీంతో విమర్శలకు మరింత బలం చేకూరినట్లయింది.
ఈ పరిణామాల్లో నిఘా వర్గాల నుంచి అందిన సమాచారమో, మరే కారణమో తెలియదుగాని, ఈనెల 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి కొందరు మంత్రులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రైతు భరోసా నిధుల విడుదల గురించి స్పష్టతనిచ్చారు. వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు నమ్మవద్దని, రైతు భరోసా పథకాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని కూడా సీఎం ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
అయితే సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాల్లోనూ రైతు భరోసా అంశాన్ని సీఎం ప్రస్తావించడం గమనార్హం. తాము చెల్లిస్తున్న బోనస్ మొత్తాల గురించి ఓ ఆడబిడ్డ కళ్లనిండా ఆనందంతో చెబుతుంటే తనకు కడుపు నిండినట్లయిందని, మంచి బిర్యానీ తిన్నట్లయిందని సీఎం పేర్కొనడం గమనార్హం. అయితే రైతు భరోసా నిధులను సంక్రాంతి పండుగ తర్వాత చెల్లిస్తామని ఆదివారం చెప్పిన విషయాన్ని కూడా ఇదే వేదికపై సీఎం పునరుద్ఘాటించడం ప్రస్తావనార్హం.
మొన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి అటు రైతు భరోసా అంశాన్ని, ఇటు సన్నాలకు బోనస్ ప్రయోజనాలను పదే పదే ప్రస్తావిస్తుండడం రైతాంగంలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధులపై ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఆ సీజన్ రైతు భరోసా నిధులకు పాలకులు నీళ్లొదినట్లేననే విషయం స్పష్టమైంది. రైతులు కూడా ఖరీఫ్ రైతు భరోసా నిధులపై ఆశలు వదులుకున్నారు.
యాసంగి రైతు భరోసా నిధుల గురించి చిన్న, సన్నకారు రైతులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో సన్నాలకు బోనస్ పేరుతో పదే పదే ఇదే విషయాన్ని పాలకులు ప్రస్తావిస్తుండడాన్ని బట్టి సహజమైన సందేహాలే రైతు వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ నిన్నటి ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి, సన్నాలకు బోనస్ గురించి మళ్లీ ఏమన్నారో ఈ దిగువన గల వీడియోలో చూడవచ్చు.