పాలేరు రిజర్వాయర్ దిగువన గల నాగార్జున సాగర్ ఎడమ కాల్వ మరమ్మత్తుల విషయంలో సంబంధిత శాఖ ఇంజనీర్లపై ప్రభుత్వం వేటు వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించిన ముగ్గురు ఇంజనీరింగ్ అధికారుల తీరును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం.
పాలేరు దిగువన గల నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు ఈనెల 1వ తేదీన గండి పడిన సంగతి తెలిసిందే. గడచిన 22 రోజులుగా ఈ కాల్వ గండిని పూడ్చి సకాలంలో రైతులకు నీరందించే విషయంలో కొందరు అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్లు ప్రభుత్వం గ్రహించినట్లు తెలుసతోంది.
కాలువ మరమ్మత్తు పనులు జరిగే సమయంలో ఓ ముఖ్య ఇంజనీర్, మరో ఇద్దరు అతని కింది స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో లేరనే అంశంపై ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పెద్దలు వీరి వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్నారట.
విపక్ష పార్టీ నేతలకు విమర్శనాత్మక అస్త్రంగా పాలేరు కాల్వ మరమ్మత్తు అంశం లభించడానికి కొందరు ఇంజనీర్ల నిర్లక్ష్యమే కారణమని ప్రభుత్వం భావిస్తున్నదట. దీంతో ముగ్గురు ఇంజనీరింగ్ అధికారులపై మంగళవారం వేటు పడే అవకాశం ఉందంటున్నారు. బహుషా ఈ చర్య సస్పెన్షన్ వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు సంబంధించి మరికొద్ది గంటల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.