‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.., గల్లీ సిన్నదీ, గరీబోళ్ల కథ పెద్దది..’ అనే పల్లె పాటలు వింటుంటే గోరటి వెంకన్న గుర్తుకొస్తారు. తెలంగాణా పల్లె ప్రజల జీవన శైలిని పాటలుగా రాసి, తనే స్వయంగా ఆలపించడంలో గోరటి వెంకన్నది అందెవేసిన చెయ్యి. మాండలికం ఏదైనా జనం వాడుకభాషలో పల్లె పాటలను ఆలపించడంలో వెంకన్న ప్రత్యేకతను ఆపాదించుకున్నారు. ఇందుకు సంబంధించి గోరటి అనేక పురస్కారాలను కూడా పొందారు. ఈ మధ్యే తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా ఆయనకు ఎమ్మెల్సీగా పట్టం గట్టిన సంగతి తెలిసిందే.
గురువారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లతోపాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కూడా ప్రత్యేక బస్సులో పయనించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను కీర్తిస్తూ ఆయన ఆలపించిన పాట ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గోరటి వెంకన్న అందుకున్న రాగాలాపన ఆయనలోని సరికొత్త స్వరాన్ని ఆవిష్కరించింది.
‘నూనె బోతె ఎత్తవచ్చు… నున్ననైన రోడ్లురో…
అద్దం లేకుండా మొఖం అండ్లనే జూడొచ్చురా…!!
ఎనకట గతుకుల రోడ్లు ఎంతగ మారెను చూడరా…
గులాబీ రేకుల తీరుగ నగరమెల్ల మెరుగురా!!
అని అంటున్నారు గోరటి వెంకన్న. డౌటుంటే దిగువన గల వీడియోను చూడండి. గోరటి వెంకన్న గొంతులో ఎన్నో ఆసక్తికర పదాలు మరింత శ్రావ్యంగా వినిపిస్తాయ్!