తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫాం హౌజ్ ను కలిపే కొండపోచమ్మ రిజర్వాయర్ పనులు రికార్డు వ్యవధిలో పూర్తయ్యాయి. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2వ తేదీన కేసీఆర్ వ్యవసాయ భూములను ఈ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు తడపనున్నాయి. నిర్దేశిత గడువులోపు టాస్క్ పూర్తి చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ కేసీఆర్ ప్రాజెక్టుల కలకు గొప్ప ముగింపు కానుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ కేసీఆర్ ఫాం హౌజ్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రిజర్వాయర్లో రెండు టీఎంసీల నీరు నిల్వ ఉంటే, ఆయకట్టు పరిధిలోని కేసీఆర్ కు చెందిన 85 ఎకరాలు సహా మొత్తం 3.00 లక్షల ఎకరాల భూములకు సాగు నీరు అందుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కు వ్యవసాయంపై ప్రత్యేక అభిరుచి ఉంది. తెలంగాణాకు ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందే సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వద్ద అధునాతన ఫాం హౌజ్ నిర్మాణం ద్వారా తన భూములను అభివృద్ధి చేశారు. తన ఫాం హౌజ్ లో డిమాండ్ ఆధారిత పంటలను పండించడం ద్వారా హెక్టారు భూముల్లో రూ. 10 కోట్ల విలువైన పంటలు పండిస్తున్నట్లు కేసీఆర్ గతంలో ప్రకటించారు.
అత్యంత లౌక్యంగా ఉంది కదూ ఈ వార్తా కథనం? ‘సియాసత్’ ప్రచురించిన తాజా వార్తా కథనపు సారాంశం మాత్రమే ఇది. శీర్షికలోనే నర్మగర్భపు అర్థాన్ని స్ఫురింపజేస్తున్న ఈ వార్తా కథనం అత్యంత చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ భగీరథ తపనను ఓ వైపు కీర్తిస్తూనే, కేసీఆర్ పంటపొలాలకు గోదావరి జలాలు అందనున్నాయనే లౌక్యభావంతో వార్తా కథనం కొనసాగడం గమనార్హం. ప్రస్తుతం ఈ వార్తా కథనం మీడియా సర్కిళ్లలో హాట్ టాపిక్. ‘సియాసత్’ మీడియా సంస్థ ప్రచురించిన ఈ ఆసక్తికర పూర్తి కథనాన్ని దిగువన గల లింక్ ద్వారా చదవవచ్చు.
‘సియాసత్’ పూర్తి వార్తా కథనం కోసం లింక్ క్లిక్ చేయండి: Godavari water to irrigate KCR’s farmlands